JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాల్లో మరోసారి ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఎప్పుడూ తన ఘాటు వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఈసారి మాత్రం పూర్తి భిన్నంగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ గొడవల వల్ల నష్టపోతున్నది నాయకులు కాదని, క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలేనని ఆయన బాహాటంగానే అంగీకరించడం ఇప్పుడు నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది.
కార్యకర్తలకు క్షమాపణలు.. నిజాలు చెప్పిన జేసీ
రాజకీయాల కోసం ఒకరిపై ఒకరు గొడవలకు దిగి జీవితాలను నాశనం చేసుకోవద్దని జేసీ కార్యకర్తలకు సూచించారు. ‘మేము నాయకులంగా ఏసీ రూముల్లో హాయిగా ఉంటాం.. కానీ గొడవల్లో చిక్కుకుని ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకుని రోడ్డున పడేది మాత్రం మీరే’ అంటూ కళ్లు తెరిపించే నిజాలను మాట్లాడారు. అంతేకాకుండా, గ్రామాల్లో ఉన్న రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు ముందస్తుగా క్షమాపణలు చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు.
తాడిపత్రిలో ఫ్యాక్షన్ అంతమే నా లక్ష్యం
తాడిపత్రి నియోజకవర్గంలో ఎలాగైనా ఫ్యాక్షనిజాన్ని తగ్గించి ప్రశాంత వాతావరణం తీసుకురావడమే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా పుట్లూరు, ఎల్లనూరు మండలాల్లో నాయకుల మధ్య ఉన్న విభేదాలు, గొడవలు తక్షణమే తగ్గాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఎవరూ ఆవేశపడి గొడవలకు పాల్పడవద్దని, రాజకీయాల్లో భయపడేవాడు ఎప్పటికీ ఎదగలేడని వ్యాఖ్యానించారు.
ఈనెల 11న పర్యటన.. బాధితులకు భరోసా
గతంలో జరిగిన గొడవల్లో నష్టపోయిన కుటుంబాలను త్వరలోనే స్వయంగా కలుస్తానని జేసీ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఈనెల 11వ తేదీ నుంచి తాడిపత్రి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు. గ్రామాలు ప్రశాంతంగా ఉంటేనే అందరికీ మంచిదని, శాంతి భద్రతల కోసం ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
Also Read: గండిపేట కాండ్యూట్కు స్పీడ్ రిపేర్లు.. నీటి సరఫరాపై జలమండలి కీలక ఆదేశాలు!