Wildlife Bridges: సాధారణంగా వంతెనలు, అండర్ పాస్ లు మనుషులు, ట్రాఫిక్ రద్దీ, వాహన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తారు. కానీ కెనడా మాత్రం ఇందుకు భిన్నంగా జంతువులను దృష్టిలో ఉంచుకొని వాటిని నిర్మించింది. తద్వారా జంతు ప్రమాదాలను నివారించి.. యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి 90వ దశకంలోనే క్రూర మృగాల కోసం ప్రత్యేకంగా వంతెనలు కడతామని కెనడా ప్రపంచానికి చెప్పింది. కానీ అప్పట్లో ఆ ప్రకటన విని చాలా మంది నవ్వుకున్నారు. కానీ 3 దశాబ్దాల తర్వాత ఈ ప్రాజెక్ట్ సాధించిన విజయం చూసి.. ప్రపంచమంతా ముక్కున వేలేసుకుంటోంది.
కెనడాలోని ‘బాంఫ్ నేషనల్ పార్క్’ మీదుగా దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ‘ట్రాన్స్-కెనడా హైవే’ వెళ్తుంది. వాహనాల రద్దీ పెరగడంతో వేగంగా వెళ్లే కార్లు, ట్రక్కుల కింద పడి వందలాది అరుదైన జంతువులు ప్రాణాలు కోల్పోయేవి. ఆహారం, వేట కోసం అవతలి వైపునకు వెళ్లలేక జంతువులు ఎంతగానో ఇబ్బందలు పడేవి. దీనికి పరిష్కారంగా ‘పార్క్స్ కెనడా’ ఇంజనీర్లు రోడ్డుకి ఇరువైపులా ఉన్న అడవులను కలుపుతూ ప్రత్యేక ఓవర్ పాస్‌లు (వంతెనలు), అండర్ పాస్‌లను రూపకల్పన చేశారు.
ఈ వంతెనలు సాధారణ సిమెంట్ కాంక్రీట్ నిర్మాణాల్లా ఉండకుండా ఇంజనీర్లు జాగ్రత్త వహించారు. జంతువులకు తాము వంతెన దాటుతున్నామనే భావన రాకుండా వాటిపై దట్టమైన మట్టిని పేర్చి, స్థానిక చెట్లు, గడ్డి, పొదలను పెంచారు. వాహనాల హోరు జంతువులకు వినబడకుండా ఈ సహజ సిద్ధమైన వాతావరణం కాపాడుతుందని వారి ప్లాన్. దుప్పుల వంటి జంతువులకు వెడల్పాటి ఓవర్ పాస్‌లు.. ఎలుగుబంట్లు, తోడేళ్ల కోసం చిన్నపాటి అండర్ పాస్‌లను సిద్ధం చేశారు. అంతేకాకుండా జంతువులు నేరుగా రోడ్డుపైకి రాకుండా రోడ్డుకిరువైపులా 80 కిలోమీటర్లకు పైగా బలమైన కంచెను ఏర్పాటు చేశారు.
వంతెనలు, అండర్ పాస్ నిర్మాణం అనంతరం.. శాస్త్రవేత్తలు కెమెరాలు, జీపీఎస్ ట్రాకర్లతో పరిశీలించగా అద్భుతమైన ఫలితాలు వెలుగుచూశాయి. ఇప్పటివరకు 2,50,000 కంటే ఎక్కువ సార్లు క్రూర మృగాలు ఈ వంతెనలను సురక్షితంగా దాటినట్లు తేలింది. హైవేపై జంతువుల మరణాలు ఏకంగా 80 శాతం తగ్గిపోగా, దుప్పులు-జింకల మరణాలు 96 శాతానికి పైగా తగ్గాయి. దీనివల్ల జంతువుల ప్రాణాలు దక్కడమే కాక.. వాహనదారులకు ప్రమాదాలు తప్పాయి. ఫలితంగా భారీ ఆస్తి, ప్రాణ నష్టం తగ్గింది. అలాగే రెండు వైపులా ఉన్న జంతువులు కలిసి జీవించడం వల్ల వాటి జన్యు వైవిధ్యం (Genetic Diversity) కూడా దెబ్బతినకుండా రక్షింపబడింది.
Also Read: ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్.. దీపావళి కానుకగా కార్లు అందజేత.. ఈ కంపెనీకి హాట్సాఫ్ చెప్పాల్సిందే!
ఒకప్పుడు దండగ అన్న ఈ ప్రాజెక్టే ఇప్పుడు ప్రపంచ దేశాలకు రోల్ మోడల్‌గా మారింది. ఈ విజయం ప్రేరణతో అమెరికా, నెదర్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా తమ జాతీయ రహదారులపై ఇలాంటి ‘వైల్డ్‌లైఫ్ క్రాసింగ్‌లను’ నిర్మిస్తున్నాయి. మెుత్తంగా మానవ అభివృద్ధికి, ప్రకృతి పరిరక్షణకు నడుమ సమతుల్యత సాధించవచ్చని కెనడా ప్రపంచానికి నిరూపించింది.
Also Read: బంగారంలో అసలు పసుపు రంగే ఉండదా? మరి ఈ దగదగ మెరుపు వెనుక రహస్యం ఏంటి?