Spanish Comedy Drama: చారిత్రాత్మక వైభవం, విలాసవంతమైన కోటలు… కానీ ఆ తరువాత పూర్తిగా అప్పులపాలై రోడ్డున పడిన ఒక రాజ కుటుంబం తాలూకు విషాద ప్రయాణమే ఈ స్పానిష్ డ్రామా సిరీస్ ‘ఫేడింగ్ గ్రాండియర్’ (Fading Grandeur). ఈ సిరీస్ ఒకప్పుడు దేశాన్ని శాసించిన రాజవంశం… కాలం మారుతున్న కొద్దీ తమ ఆస్తులను, రాయల్ హోదాను కోల్పోవడం మొదలుపెట్టే నేపథ్యంలో సాగుతుంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, బయటి ప్రపంచానికి మాత్రం తమ బ్రాండ్ ఇంకా తగ్గలేదని బిల్డప్ ఇచ్చే ఆ కుటుంబ సభ్యుల ఈగో, వారు పడే పాట్లు చూస్తే కంటతడి పెట్టడంతో పాటు నవ్వులు కూడా పూస్తాయి. మరి ఇంతకీ ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అంటే…
డాన్ లియాండ్రో ఒకప్పుడు గొప్ప హోదా, రాజరికపు నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన మార్క్విస్. కానీ ఇప్పుడు అతని పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కుటుంబానికి చెందిన భారీ భవనం పాడైపోతోంది. అప్పులు పెరిగిపోతాయి. ఖర్చులు మాత్రం తగ్గవు. అయినా సమాజంలో తనకున్న హోదా తగ్గకూడదని, అందరి ముందు గౌరవం నిలబెట్టుకోవాలని లియాండ్రో ప్రయత్నిస్తుంటాడు. వాస్తవ పరిస్థితి ఒకలా ఉంటే, బయటకు కనిపించే జీవితం మరోలా ఉండటంతో అతని సమస్యలు రోజురోజుకూ పెరుగుతాయి.
కూతురు మార్టినా పెళ్లి కూడా అతనికి మరో ఆర్థిక భారంగా మారుతుంది. పెళ్లి ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో కుటుంబానికి చెందిన పాత భవనాన్ని అమ్మేయాలని నిర్ణయించుకుంటాడు. ఇక్కడే సోఫియా కారింగ్టన్ అనే సంపన్న వ్యాపారవేత్త కథలోకి వస్తుంది. ఆ భవనాన్ని కొనడానికి ఆమె ఆసక్తి చూపించడంతో లియాండ్రోకు తన సమస్యలన్నీ తీరిపోతాయని ఆశ కలుగుతుంది. కానీ ఈ ఒప్పందం అంత సులభంగా ముందుకు సాగదు. ఇద్దరి మధ్య జరిగే చర్చలతో కథ కొత్త మలుపులు తిరుగుతుంది.
ఇదిలా ఉంటే, తన ఆర్థిక పరిస్థితిని ఇతరులకు తెలియకుండా దాచి పెట్టేందుకు లియాండ్రో చేసే ప్రయత్నాలు ఒక్కోసా
రి అతడినే ఇబ్బందుల్లోకి నెడతాయి. ధనవంతుల మధ్య తన పరువు కాపాడుకోవాలని చేసే హడావుడి, అప్పుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు హాస్యాన్ని పంచుతాయి. మరోవైపు సోఫియా కూడా తన జీవితంలోని సమస్యలను ఎదుర్కొంటూ, ఈ ఒప్పందం ద్వారా తాను అనుకున్నది సాధించేందుకు ప్రయత్నిస్తుంది. ఇద్దరూ బయటకు చూపించే వ్యక్తిత్వానికి, వారి నిజమైన పరిస్థితులకు మధ్య ఉన్న తేడా కథలో ఆసక్తిని పెంచుతుంది. డబ్బు ఉన్నవాళ్లకు కూడా సమస్యలు ఉంటాయని, హోదా కోసం బతికితే నిజ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఈ కథలో కామెడిగా చూపించారు.
‘ఫేడింగ్ గ్రాండియర్’ స్పానిష్‌లో ‘గ్రాండే డి ఎస్పానా’ పేరుతో రూపొందిన ఆరు ఎపిసోడ్ల కామెడీ డ్రామా సిరీస్. అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది. స్పానిష్ ఆడియో మాత్రమే అందుబాటులో ఉంది. ఆంటోనియో డి లా టోర్రె, అలెగ్జాండ్రా జిమెనెజ్, ఎన్రిక్ బెనావెంట్ నటించిన ఈ సిరీస్‌కు జువాన్ కేవెస్టనీ, అల్వారో ఫెర్నాండెజ్-ఆర్మెరో సంయుక్తంగా దర్శకత్వం వహించారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆ భారీ రాజభవనాన్ని, ఆస్తులను కాపాడుకోవడానికి వారు చేసే విచిత్రమైన ప్రయత్నాలు, సమాజంలో ఎదురయ్యే అవమానాలు కథను చాలా ఎమోషనల్‌గా నడిపిస్తాయి. ఒకవైపు చక్కటి కామెడీ టచ్ ఇస్తూనే, మరోవైపు మనిషి జీవితంలో సంపద, వైభవం ఎప్పటికీ శాశ్వతం కాదనే సత్యాన్ని ఈ సిరీస్ ద్వారా దర్శకుడు కళ్లకు కట్టారు.
Read Also: నవలల్లో రాసిన నిధి కోసమే రచయిత్రి కిడ్నాప్… అడవిలోకి వెళ్ళాక ఒక్కొక్కరికీ చుక్కలు