Ayyapa Devotees: రైల్లో కర్పూరం వెలిగించి పూజలు చేసిన అయ్యప్ప భక్తులపై సేలం పోలీసులు కేసు ఫైల్ చేశారు. శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప భక్తులు సేలం సమీపంలో రైలు బోగీలో కర్పూరం వెలిగించి పూజలు చేశారు. తిరుపతి- కొల్లం వీక్లీ ఎక్స్ ప్రెస్ రైల్లో ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు ఈ పూజలు నిర్వహించారు. సెకండ్ క్లాస్ రిజర్వేషన్ బోగీలో భక్తులు పూజలు చేశారు. వారిలో ఒక మహిళా అయ్యప్ప భక్తురాలు కూడా ఉంది. కర్పూరం వెలిగించడం పట్ల తోటి ప్రయాణీకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పట్టించుకోకుండా అలాగే పూజలు చేశారు. వేలాది మంది ప్రయాణించే రైలులో భక్తులు ఇలా పూజలు చేయడం మంచిది కాదనే విమర్శలు వెల్లువెత్తాయి.
కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు
అటు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోషల్ మీడియా వీడియోలను చూసి సేలం ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. “ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురు అయ్యప్ప భక్తులు శబరిమలై వెళ్తున్నారు. సెకెండ్ క్లాస్ స్లీపర్ కోచ్ లో రైలు ఎక్కిన భక్తులు కర్పూరం వెలిగించి అయ్యప్ప పూజలు చేశారు. రైల్లో కర్పూరం వెలిగించడం పూర్తిగా నిషేధం. ఉల్లంఘించిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది” అని ఆయన వెల్లడించారు.
ముందుగానే అయ్యప్పభక్తులకు సూచనలు చేసిన రైల్వే సంస్థ
శబరిమల వెళ్తున్న భక్తులకు ముందుగానే రైల్వే సంస్థ కీలక సూచనలు చేసింది. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను కేటాయించిన నేపథ్యంలో భక్తులు రైలు బోగీలో చేయకూడని పనుల గురించి క్లారిటీ ఇచ్చింది. రైళ్లలో పూజలు నిర్వహించకూడదని రైల్వే అధికారులు వెల్లడించారు. మండే స్వభావం కలిగిన కర్పూరం అస్సలు వెలిగించకూడదన్నారు. రైళ్లలో కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం, అగరబత్తులు వెలిగించడం, సాంబ్రాణి పుల్లలు మండించడం లాంటి పనులు చేయకూడదన్నారు. మండే లక్షణం కలిగిన పదార్థాలతో అసలు ప్రయాణం చేయకూడదన్నారు. మండే స్వభావం ఉన్న పదార్థాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రమాదవశాత్తు మంటలు అంటుకుంటే, ప్రాణ, ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఇలాంటి వాటిని నిషేధించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. నింబంధనలను ఉల్లంఘించిన వారిపై రైల్వే యాక్ట్ ప్రయోగిస్తామన్నారు. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 67, 154, 164, 165 ప్రకారం నిబంధనలు బ్రేక్ చేసిన వారికి 3 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రల నుంచి 34 ప్రత్యేక రైళ్లు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు అయ్యప్ప మాలలు వేసే అవకాశం ఉండటంతో రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెండు రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తుల కోసం 34 స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే శబరిమలకు ఇప్పటికే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు 34 అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించింది. రైల్వే నిర్ణయం పట్ల అయ్యప్ప భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Alos: శబరిమలైకు రైలులో వెళ్తున్నారా.. ఈ రూల్ తప్పక పాటించాల్సిందే!