Indian Railway – Ayyappa Devotees: రైల్వే భద్రతా పరమైన అంశానికి సంబంధించి రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రధానంగా అయ్యప్ప భక్తులను దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే పలు సూచనలు జారీ చేసింది. ఈ విషయాన్ని గమనించి అయ్యప్ప భక్తులు సహకరించాలని కూడా రైల్వే విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం కేరళలోని శబరిమలైకు అయ్యప్ప భక్తులు ఎక్కువగా తరలివస్తున్నారు. పవిత్రమైన మాలధారణ పాటించిన భక్తులు, తమ దీక్షను విరమించేందుకు అధిక సంఖ్యలో శబరిమలై అయ్యప్ప ఆలయానికి తరలివస్తారు. అటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండ, రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
ఈ ప్రత్యేక రైళ్లలో ఎందరో అయ్యప్ప భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న భక్తులు ఇప్పటికే, ఈ రైళ్లలో సీట్లను సైతం రిజర్వేషన్ చేసుకున్నారు. ఇప్పటికే ఎందరో భక్తులు రైళ్ల ద్వార, శబరిమలై కు వెళ్లి తమ దీక్షను విరమించారు. కాగా అయ్యప్ప భక్తులు సాధారణంగా పూజలు నిర్వహించడం ఆనవాయితీ.
ఉదయం, సాయంత్రం పూజలు నిర్వహించి భక్తితో అయ్యప్ప గీతాలను ఆలపిస్తారు. అయితే కొందరు అయ్యప్ప భక్తులు పూజా విధానంలో భాగంగా కర్పూరం, హారతి, అగరబత్తులు, సాంబ్రాణి పుల్లలు వెలిగిస్తున్నట్లు రైల్వే శాఖ దృష్టికి వచ్చింది. దీనితో రైల్వే శాఖ అప్రమత్తమై ఒక ప్రకటన విడుదల చేసింది.
రైలులో ప్రయాణించే అయ్యప్ప భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని భక్తులు తమ సూచనలు తప్పక పాటించాలని రైల్వే కోరుతోంది. రైలులో ప్రయాణించే సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లో, అగ్గి రాజేసే చర్యలకు పూనుకోవద్దని సూచించింది. అంటే పెద్ద ఎత్తున హారతులు ఇవ్వడం ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని రైల్వే తెలుపుతోంది. అలాగే అయ్యప్ప భక్తుల భద్రత కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరి మీరు కూడా శబరిమలై వెళుతున్నారా.. మీతో పాటు మీతోటి స్వాముల భద్రతను దృష్టిలో ఉంచుకొని, రైల్వే శాఖ సూచనలు పాటించండి. అలాగే ఆ అయ్యప్పను దర్శించి, సకల కోరికలు తీరాలని వేడుకోండి.