Cherlapally Railway Terminal: సౌత్ సెంట్రల్ రైల్వేలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఇప్పటి వరకు అతిపెద్ద రైల్వే స్టేషన్ గా కొనసాగుతున్నది. మరికొద్ది రోజుల్లో ఈ స్టేషన్ కు ప్రత్యామ్నాయ స్టేషన్ అందుబాటులోకి రాబోతోంది. చర్లపల్లి వేదికగా రైల్వే హబ్ రెడీ అయ్యింది. సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లలో రోజు రోజుకు ప్రయాణీకుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ చర్లపల్లి స్టేషన్ కు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్ స్టేషన్ కు ప్రత్యామ్నాయ కేంద్రంగా రెడీ చేసింది.
రూ. 450 కోట్లతో నిర్మాణం
చర్లపల్లి రైల్వే హబ్ ను కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 450 కోట్లతో అత్యధునిక వసతులతో నిర్మించింది. అచ్చం విమానాశ్రయం మాదిరిగానే రెండు అంతస్తులలో ఈ రైల్వే స్టేషన్ ను ఏర్పాటు చేసింది. ఈ రైల్వే స్టేషన్ లో మొత్తం 9 రైల్వే ఫ్లాట్ ఫారమ్ లను ఏర్పాటు చేశారు. 9 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు, రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు. ఇప్పటికే ఈ రైల్వే స్టేషన్ నుంచి పలు రైళ్లు నడుస్తున్నాయి. మరిన్ని రైళ్లను ఇక్కడ ఆపే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ ను ప్రధాని మోడీ ఈ నెలలోనే ప్రారంభించనున్నారు. ఇప్పటికే రైల్వే స్టేషన్ పనులు పూర్తి కావడంతో రీసెంట్ గా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పరిశీలించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. త్వరలోనే ప్రధాని మోడీని హైదరాబాద్ కు తీసుకొచ్చి ఈ రైల్వే స్టేషన్ ను ప్రారంభించే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. అటు ఈ రైల్వే స్టేషన్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం చర్లపల్లి పరిసర ప్రాంతాల్లో రోడ్లు విస్తరణ పనులను చేపట్టింది. రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గాలను విస్తరిస్తోంది.
రైల్వే బోర్డు కీలక అనుమతులు మంజూరు
చర్లపల్లి రైల్వే స్టేషన్ పనులు పూర్తైన నేపథ్యంలో రైల్వే బోర్డు కీలక అనుమతులు జారీ చేసింది. చర్లపల్లి స్టేషన్ నుంచి 6 ఎక్స్ ప్రెస్ రైళ్లును నడిపేందుకు అనుమతి ఇచ్చింది. మరో 12 రైళ్లు ఈ స్టేషన్ లో ఆపేందుకు పర్మీషన్స్ ఇచ్చింది. ప్రధాని మోడీ ఈ రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన తర్వాత ఇక్కడి నుంచి రైళ్లను నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే రెడీ అవుతోంది. ఇక్కడి నుంచి పలు రైళ్లను సుదూర ప్రాంతాలకు నడిపేందుకు నిర్ణయం తీసుకుంది.
చర్లపల్లి నుంచి నడిచే రైళ్లు
ప్రస్తుతం చర్లపల్లి నుంచి 6 ఎక్స్ ప్రెస్ రైళ్లు నడిచేందుకు అనుమతులు వచ్చాయి. ఆ రైళ్లలో గోరఖ్ పూర్-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- హైదరాబాద్ ఎక్స్ ప్రెస్, షాలిమార్ – హైదరాబాద్ ఈస్ట్ కోస్టు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలను కొనసాగించగా, ఇకపై చర్లపల్లి నుంచి ప్రయాణాలను కొనసాగించనున్నాయి.
చర్లపల్లి స్టేషన్ లో నిలిచే రైళ్లు
మరోవైపు చర్లపల్లి స్టేషన్ లో నిలిచే రైళ్లలో గుంటూరు- సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. స్టేషన్ ప్రారంభం అయ్యాక మరిన్ని మార్పులు, చేర్పులు ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also: సిమ్లా టాయ్ ట్రైన్ లో జర్నీ చేయాలనుందా? సింఫుల్ గా ఇలా టికెట్ బుక్ చేసుకోండి!