Hydra: హైడ్రా అధికారులు చెరువుల పునరుద్దరణ, విపత్తుల నిర్వహణపై అధ్యయనం చేసేందుకు నేడు బెంగుళూరుకు వెళ్లారు. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, చెరువుల సంరక్షణతో హైడ్రాకు ఎంతో గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు హైడ్రాపై అసత్య ప్రచారం చేసినప్పటికీ తన పని తాను చేసుకుంటూపోతున్న హైడ్రాకు ప్రజల మద్దతు లభిస్తోంది. చెరువులను సంరక్షించాలని, అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇప్పటికే చెరువుల్లో నిర్మించిన పలు కట్టడాలను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. కాగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలోని ఐదు చెరువలను పునరుద్దరించాలని ఇటీవల హైడ్రాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర అధికారులతో కలిసి బెంగుళూరులో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అధికారులు కర్నాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ ను సందర్శించనున్నారు. అక్కడ సీనియర్ శాస్త్రవేత్తలతో రంగనాథ్ సమావేశమవుతారు. ఆ తరవాత అక్కడ నుండి సెన్సార్స్ సహాయంతో పర్యవేక్షిస్తున్న మురుగునీటి వ్యవస్థను పరిశీలించనున్నారు.
అంతే కాకుండా బెంగుళూరు కోర్ సీటీలో ఉన్న చెరువులను సందర్శిస్తారు. అదే విధంగా రెండో రోజు పర్యటనలో భాగంగా లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్ తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో కర్నాటక ట్యాంక్ కన్జర్వేషన్ అథారిటీ చట్టం 2014పై చర్చిస్తారు. అనంతరం ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని మార్గం దోన్హల్లీ చెరువు, ఇన్ఫోసిస్ సంస్థ అభివృద్ధి చేసిన చెరువులను సందర్శించి అక్కడ అమలు చేసిన ఉత్తమ విధానాలు, సాంకేతిక వ్యవస్థను తెలుసుకుంటారు. బెంగుళూరులో అధ్యయనం తరవాత హైదరాబాద్ లో చెరువుల పునరుద్ధరణకు ప్రణాళికను రచించనున్నారు. దీంతో రంగనాథ్ చెరువుల పరిరక్షణకై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.