Cyclone Arnab Disrupts Flights: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల నుంచి నడిచే పలు విమానాలను రద్దు చేశారు. అక్టోబర్ 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 36కు పైగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై సహా పలు నగరాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తుఫాన్ ప్రభావం విశాఖపట్నం విమానాశ్రయంపై ఎక్కువగా పడింది. అక్టోబర్ 27 మధ్యాహ్నం నుంచి విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విశాఖ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, తిరుపతి, కర్నూలు వెళ్లాల్సిన 16 సర్వీసులను రద్దయ్యాయి. వాతావరణ పరిస్థితులను బట్టి విమానాల రాకపోకలపై అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
విజయవాడ గన్నవరం విమానాశ్రయంలోనూ పలు విమానాలు రద్దయ్యాయి. అక్టోబర్ 27న ఐదు సర్వీసులు నిలిచిపోగా, అక్టోబర్ 28న 15కు పైగా విమానాలు రద్దయినట్లు సమాచారం. ఇండిగోతో పాటు ఎయిర్ ఇండియా, ఫ్లై91 సంస్థల సర్వీసులపైనా ప్రభావం పడింది.
రాజమండ్రి విమానాశ్రయంలోనూ అక్టోబర్ 27 రాత్రి నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి వంటి నగరాలకు వెళ్లాల్సిన కొన్ని సర్వీసులు రద్దయ్యాయి. ఏపీకి కనెక్టింగ్ గా ఉన్న చెన్నై మార్గంలోనూ పలు విమానాలను నిలిపివేశారు.
తుఫాన్ కారణంగా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించేందుకు విమానయాన సంస్థలు చర్యలు చేపట్టాయి. టికెట్ నిబంధనలను బట్టి పూర్తి రీఫండ్ లేదంటే మరో తేదీకి ప్రయాణాన్ని మార్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. ప్రయాణికులు తమ విమాన సంస్థ నుంచి వచ్చిన సందేశాలను పరిశీలించి, విమానం నడుస్తుందో లేదో ముందుగానే నిర్ధారించుకోవాలి.
మరోవైపు తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. విమానాలతో పాటు పలు రైళ్ల రాకపోకలపైనా తుఫాన్ ప్రభావం పడటంతో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Also: అర్నబ్ కల్లోలం.. తెలుగు రాష్ట్రాల్లో 64 రైళ్లు క్యాన్సిల్!