Brahma Temple: బ్రహ్మ అనగానే తలరాతలు రాసిన సృష్టికర్త గుర్తుకు వస్తాడు. హిందూ మతంలో బ్రహ్మ దేవుడిని సృష్టికర్తగా పూజిస్తారు. అయితే, బ్రహ్మదేవుడికి కట్టిన గుళ్ల గురించి చాలా అరుదుగా వింటూ ఉంటాం. భారతదేశంలో బ్రహ్మదేవునికి అంకితం చేసిన ప్రసిద్ధ ఆలయం రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఉన్న జగత్పిత బ్రహ్మ ఆలయం. ఇది దేశంలోనే బ్రహ్మదేవునికి కట్టిన అతి కొన్ని ఆలయాలలో ఒకటి. పుష్కర్‌లో ఉన్న ఈ బ్రహ్మ ఆలయం గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌ను చదవాల్సిందే..
చతుర్ముఖ రూపంలో బ్రహ్మ
పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయం 14వ శతాబ్దంలో నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే, దీని మూలాలు వేయి సంవత్సరాల క్రితం నాటివని పురాణం కథనాలు చెబుతున్నాయి. హిందువులకు పవిత్రమైన తీర్థయాత్ర స్థలమైన ఇది పుష్కర్ సరస్సు సమీపంలో ఉంది. దీని నిర్మాణం సాంప్రదాయ రాజస్థానీ శైలిలో ఎరుపు రంగు గోపురం, సున్నితమైన శిల్పాలతో అలంకరించారు. ఈ ఆలయంలో బ్రహ్మదేవుడు నాలుగు ముఖాలతో చతుర్ముఖ రూపంలో కొలువై ఉంటాడు. ఈ నాలుగు ముఖాలు నాలుగు వేదాలకు సంకేతమని చరిత్ర కారులు చెబుతున్నారు.
బ్రహ్మదేవుడు పుష్కర్ నదిలో యజ్ఞం చేసే సమయంలో ఆయన భార్య అయిన సరస్వతి దేవి రావడం ఆలస్యం అయ్యింది. దీనివల్ల బ్రహ్మ దేవుడు సావిత్రిని వివాహం చేసుకోవడం వల్ల సరస్వతి దేవికి కోపం వచ్చి బ్రహ్మకు శాపం ఇచ్చిందని పురాణం కథనాలు చెబుతున్నాయి. సరస్వతి దేవి ఇచ్చిన ఈ శాపం కారణంగా బ్రహ్మదేవుడికి ఆలయాలు తక్కువగా నిర్మించారని హిందువుల నమ్మకం. ఈ పుష్కర్ బ్రహ్మ ఆలయం బ్రహ్మదేవుడి భక్తులకు, ఆలయ సందర్శకులకు ఒక మంచి డెస్టినేషన్ అని చెప్పొచ్చు.
పుష్కర్ మేళా
సంవత్సరానికి ఒకసారి కార్తీక పౌర్ణమి సమయంలో ఈ ఆలయంలో జరిగే పుష్కర్ మేళాకి లక్షలాది భక్తులు బ్రహ్మ దేవుని దర్శనం కోసం దేశం నలుమూలల నుండి వస్తారు. ఈ పుష్కర్ మేళా సమయంలో ఆలయం పూజలు, హోమాలతో, భక్తులతో సందడిగా ఉంటుంది. పుష్కర్ లోని ఈ బ్రహ్మ ఆలయంలో బ్రహ్మ దేవుని విగ్రహంతో పాటు సరస్వతి, గాయత్రీ దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడి పవిత్రమైన వాతావరణం భక్తులకు, సందర్శకులకు ఆధ్యాత్మిక శాంతిని కలిగిస్తుంది.
ఈ ఆలయం చుట్టూ ఉన్న పుష్కర్ సరస్సును 52 ఘాట్‌లతో అలంకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఈ సరస్సులో స్నానం చేసి బ్రహ్మదేవుని దర్శించుకుని పూజలు చేస్తారు. బ్రహ్మ దేవుడికి ఉన్న ఆలయాలు చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ ఆలయం సందర్శించడం వల్ల హిందూ సంప్రదాయంలో సృష్టికర్త బ్రహ్మదేవుని పూజించడానికి ఒక అరుదైన అవకాశాన్ని అందిస్తుంది. ఈ ఆలయం చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగి ఉంది.