Hyderabad News: టెక్ యుగంలో ఏఐ శకం మొదలు కావడంతో కంప్యూటర్ సీట్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఎంబీబీఎస్ తరహాలో CSE సీటుకు తక్కువలో తక్కువ 18 లక్షల నుంచి ధర పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేనేజ్‌మెంట్ కోటా కింద ఆ ధర చెబుతున్నట్లు కొందరు తల్లిదండ్రులు చెబుతున్నారు. యాజమాన్యాలు కోటా పేరిట దోపిడీకి పాల్పడుతున్నాయి.
దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ సీట్లు 20 లక్షల సీట్లు ఉన్నాయి. ఎక్కువ సీట్లు కలిగిన రాష్ట్రాల్లో తమిళనాడు ఫస్ట్ ప్లేస్ కాగా, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ ఏపీ, నాలుగో స్థానంలో తెలంగాణ ఉంది. తమళనాడులో 3 లక్షలకు పైగానే ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికి వద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 87 వేల పైచిలుకు సీట్లు ఉన్నాయి. అందులో టాప్ కాలేజీల గురించి చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి.
మరో పది రోజుల్లో మే నెల ముగియుంది. ఇప్పుడిప్పుడే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షా ఫలితాలు వెలువడుతున్నాయి. జూన్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీల కౌన్సెలింగ్ మొదలుకానుంది. ప్రతి కాలేజీలో 70 శాతం సీట్లను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మిగతా 30 శాతం సీట్లను మేనేజ్‌మెంట్ కోటా భర్తీ చేస్తున్నారు. ఈసారి హైదరాబాద్‌లోని టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు మేనేజ్‌మెంట్ కోటా కింద CSE సీటుకు రూ.18 లక్షల నుండి రూ.25 లక్షల వరకు ధర ఫిక్స్ చేసినట్టు సమాచారం.
ప్రస్తుతం ఏఐ శకం రావడంతో ఇంజనీరింగ్ కళాశాలలకు వరంగా మారింది. ఎంసెట్ ర్యాంక్, మార్కులతో సంబంధం లేకుండా ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని యాజమాన్యాలు దోపిడీకి శ్రీకారం చుట్టాయి. కొన్నిరోజులుగా ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్‌లో భర్తీ చేయాలనే డిమాండ్ లేకపోలేదు. మేనేజ్‌మెంట్ కోటా గురించి చెప్పనక్కర్లేదు. ఎవరు ఎక్కువ డబ్బు చెల్లిస్తే వారికే సీటును అమ్ముకుంటున్నాయి. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని విద్యార్థుల పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: ఆ మెట్ల మార్గమే 17 మంది ప్రాణాలు తీసిందా?
మేనేజ్‌మెంట్ కోటాలో నాన్ రెసిడెంట్ ఇండియన్-NRI కోటా ప్రవేశాలు కల్పిస్తారు. మేనేజ్‌మెంట్ కోటా-బి కేటగిరి సీట్లను ఎంసెట్, జెఈఈ ర్యాంకు, ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ చేయాలనే నిబంధనలు ఉన్నాయి. ఏ కళాశాల కూడా ఈ విధానాన్ని పాటించలేదు. గ్రూపు డిమాండ్ బట్టి రకకరాలుగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తల్లిదండ్రులు గంపెడంత ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది బీటెక్‌లో కొత్త ఫీజులు అమలులోకి రానున్నాయి. ఇప్పటికే ఎంసెట్ ఫలితాలు వచ్చినా ప్రవేశాల నోటిఫికేషన్ రాలేదు. బి కేటగిరి సీట్ల ప్రవేశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు తల్లిదండ్రులు.