Hyderabad Metro: హైదరాబాద్ వాసులకే కాదు.. సివారు ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. సెకండ్ ఫేజ్‌లో సరికొత్త కారిడార్‌లను తీసుకొస్తోంది. నగరానికి దూరంగా ఉండే ప్రజలు సులువుగా.. రాకపోకలు సాగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. కొత్త కారిడార్‌లో అందుబాటులోకి వస్తే.. నగరం నలుదిక్కుల మెట్రో రైలు పరుగులు పెట్టనున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్‌లో మెట్రో సెకండ్ ఫేజ్ DPR రెడీ అయ్యింది. 19 వేల కోట్ల రూపాయల అంచనాలతో రూపొందించిన DPR ప్రభుత్వానికి చేరింది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు ప్రభుత్వం. మూడు మార్గాల్లో 86.5కిలో మీటర్ల పొడవునా మెట్రో నిర్మించేందుకు సిద్ధం చేశారు. ఈ మూడు మార్గాలకు వేర్వేరుగా DPR రెడీ చేశారు. JBS టు మేడ్చల్, JBS టు శామీర్‌పేట్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు టు ఫ్యూచర్ సిటీ రూట్‌లను చేర్చారు.
ఈ మూడు మార్గాల్లో ఎక్కడా డబుల్ డెక్‌ని ప్రతిపాదించలేదు. గతంలో JBS -శామీర్‌పేట, JBS -మేడ్చల్ మార్గాల్లో డబుల్ డెక్ వేయాలని భావించారు. ఒక అంతస్తులో రోడ్డు, రెండో అంతస్తులో మెట్రో నిర్మించాలని భావించినా స్టేషన్లు చాలా ఎత్తులో నిర్మించాల్సి రావడంతో.. ఆలోచనను విరమించుకున్నారు.
ఇటు హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ రన్‌వే.. రహదారి పక్కనే ఉండటం, ఎలివేటెడ్‌కు రక్షణ సంస్థ అభ్యంతరం తెలపడంతో ఇక్కడ సుమారు కిలోమీటరున్నర వరకు భూగర్భంలోంచి మెట్రోని ప్రతిపాదించారు. రన్‌వే కింద నుంచి మెట్రో వెళ్లేలా డిజైన్ చేశారు. JBS నుంచి తాడ్‌బండ్, బోయిన్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్‌కు 24.5 కి.మీ. మేర మెట్రోని ప్రతిపాదించారు. మూడు మార్గాల జంక్షన్‌గా JBSను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సీఎం ప్రణాళికకు అనుగుణంగా ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌సిటీ వరకు 40 కిలో మీటర్ల మార్గం ప్రతిపాదించారు. ఎయిర్‌పోర్టులో టర్మినల్ స్టేషన్ భూగర్భంలో ఉంటుంది. ఈ మార్గంలో రావిర్యాల ORR వరకు ఎలివేటెడ్‌లో మెట్రో వెళితే.. అక్కడి నుంచి ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రోడ్డు మధ్యలోంచి భూ మార్గంలో 18 కిలో మీటర్లు వెళ్లేలా డీపీఆర్ సిద్ధం చేశారు.
Also Read: చైనాపై భారత్ సీరియస్.. ఊరుకునేది లేదంటూ..
రెండోదశ రెండో భాగాన్ని సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టుగా చేపట్టేలా డీపీఆర్ రూపకల్పన చేశారు. అంచనా వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం, కేంద్ర ప్రభుత్వం 18 శాతం భరించేలా ప్రతిపాదించారు. 48 శాతం బ్యాంకుల నుంచి రుణాలు, మిగిలిన 4 శాతం పీపీపీలో సమకూర్చుకునేలా డీపీఆర్ రూపొందించారు.