జపాన్ రైల్వే పరంగా అగ్రదేశాల సరసన నిలిచింది. బుల్లెట్ ట్రైన్లులో చైనా తర్వాత అత్యంత వేగంగా పరిగెత్తే రైళ్లు జపాన్ లోనే ఉన్నాయి. అక్కడ సాధారణ స్లీపర్ రైళ్లు కూడా ఎంతో లగ్జరీగా ఉంటాయి. బెర్తుల నుంచి మొదలుకొని వాష్ రూమ్స్ వరకు వావ్ అనిపిస్తాయి. సన్ రైజ్ పేరుతో పిలిచే రెండు క్రేజీ స్లీపర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. వాటిలో ఒకటి సన్ రైజ్ సెటో ఎక్స్ ప్రెస్ కాగా, మరొకటి సన్ రైజ్ ఇజుమో ఎక్స్ ప్రెస్. నిజానికి ఈ రెండు రైళ్లు కలిపి కొంత దూరం ప్రయాణిస్తాయి. ఆ తర్వాత రెండు విడిపోయి గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఈ రెండూ స్లీపర్ రైళ్లు, రాత్రంతా ప్రయాణించి ప్రయాణీకులను పగటిపూట గమ్యస్థానాలకు చేర్చుతాయి.
జపాన్ లో నడిచే ప్రముఖ స్లీపర్ రైళ్లలో సన్ రైజ్ ఎక్స్ ప్రెస్ ఒకటి. ఇది టోక్యో నుంచి పశ్చిమ జపాన్‌లోని వివిధ ప్రాంతాలకు (శికోకు, ఇజుమో) ప్రయాణిస్తుంది. దీనిని జపాన్ రైల్వే కంపెనీ నడుపుతుంది. ప్రస్తుతం జపాన్ లో ఓవర్ నైట్ రైళ్లు తగ్గుతున్నాయి. కానీ, ఈ రైళ్లు మాత్రం రెగ్యులర్ గా నడుస్తున్నాయి. సన్ రైజ్ స్లీపర్ రైలు 1998 జులై ప్రారంభంలో అందుబాటులోకి వచ్చింది. ఇది రెండు రైళ్ల సమ్మేళనం. ఈలు టోక్యో నుంచి ఓకాయామా వరకు కలిసి (14 కార్లు) ప్రయాణిస్తాయి. ఒకాయామాలో రెండు విడిపోతాయి. అంటే, మొత్తం 14 కోచ్ లు ఉండగా, ఒక్కోటి 7 కోచ్ ల చొప్పున విడిపోతాయి. అక్కడి నుంచి సన్ రైజ్ సెటో తకామత్సు (శికోకు ద్వీపం)కు వెళ్తుంది. సుమారు 9 గంటలు ప్రయాణిస్తుంది. సన్ రైజ్ ఇజుమో ఇజుమో వరకు వెళ్తుంది. సుమారు 11 గంటలు ప్రయాణిస్తుంది. ఈ రైలు రోజూ టోక్యో నుంచి సాయంత్రం బయల్దేరి, ఉదయం మళ్లీ టోక్యోకు చేరుకుంటుంది.
ఇక ఈ రైల్లో సీటింగ్ అద్భుతంగా ఉంటుంది. సీట్లు కాకుండా స్లీపింగ్ ఆప్షన్లు ఉన్నాయి. సింగిల్ ప్రైవేట్ బెడ్, విండో వ్యూ కావాలంటే 6,000 జపనీస్ యెన్(రూ.3607) నుంచి 9,000 జపనీస్ యెన్ (రూ.5410) వరకు ఉంటుంది. ఇవి సోలో ప్యాసింజర్లకు అనుకూలంగా ఉంటుంది. కంఫర్ట్ కోరుకునే వాళ్లు సూపర్ సింగిల్ బెడ్ టికెట్ తీసుకోవాలి. ఇందులో డెస్క్, సింక్ కూడా ఉంటుంది. దీని టికెట్ ధర 10,000 జపనీస్ యెన్ (రూ.6011) నుంచి 15,000 జపనీస్ యెన్ (రూ.9017) ఉంటుంది. ఇక కపుల్స్, ఫ్రెండ్స్ కోసం ట్విన్ బెడ్లు ఉంటాయి. ఒక్కో దాని ధర 15,000 జపనీస్ యెన్ నుంచి (రూ.9017) నుంచి 20,000 జపనీస్ యెన్ (రూ.12023) ఉంటుంది. ఇక మరింత లగ్జరీ కోరుకునే వాళ్లకు సింగిల్ డీలక్స్ లగ్జరీ బెడ్, షవర్ యాక్సెస్ ఉంటుంది. ఈ టికెట్ ధర ఒక్కొక్కరికి 20,000 జపనీస్ యెన్ (రూ.12023) ఉంటుంది.
ఈ రైల్లో ప్రయాణించాలంటే ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలి. జపనీస్ రైల్వే వెబ్ సైట్ తో పాటు డిడోరి నో మాడోగుచి రైల్వే కౌంటర్ లో నెల రోజుల ముందు నుంచి టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!