Indian Railways Ticket Status: భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరంగా ప్రయాణం చేస్తారు. కానీ, రద్దీ సమయాల్లో టికెట్లు అంత ఈజీగా దొరకవు. పీక్ సీజన్ లో ప్రయాణీకులు సాధారణంగా ఎదుర్కొనే సమస్య వెయిటింగ్ లిస్టు. అంటే, టికెట్ కన్ఫార్మ్ కాదు. ఈ టికెట్ వెయిటింగ్ లిస్టు రకాన్ని సూచించేందుకు ఇండియన్ రైల్వే రకరకాల కోడ్స్ ను ఉపయోగిస్తుంది. ఈ కోడ్స్ అర్థం ఏంటి? ఏ కోడ్ ఉన్న టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది? ఏ కోడ్ ఉన్న టికెట్లు రేర్ గా కన్ఫార్మ్ అవుతాయి? అనే విషయాల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ WL – వెయిటింగ్ లిస్ట్
ఇది రైల్వే వెయిటింగ్ లిస్టులో అత్యంత సాధారణంగా వినిపించే పదం. రైలులోని అన్ని సీట్లు అప్పటికే బుక్ అయినప్పడు కనిపిస్తుంది. WL టికెట్ అంటే మీ సీటు ఇంకా నిర్ధారించబడలేదని అర్థం. అప్పటికే ధృవీకరించబడిన ప్రయాణీకులు తమ టికెట్లను రద్దు చేసుకుంటేనే మీ టికెట్ నిర్ధారించబడుతుంది. మీ వెయిటింగ్ లిస్ట్ సంఖ్య తక్కువగా ఉంటే.. కన్ఫర్మేషన్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అర్థం.
⦿ GNWL – జనరల్ వెయిటింగ్ లిస్ట్
జనరల్ వెయిటింగ్ లిస్ట్ అనేది రైలు బయలుదేరే స్టేషన్ లేదంటే బయలుదేరే ప్రదేశానికి సమీపంలోని ప్రధాన స్టేషన్ నుంచి ప్రయాణించే వారికి వర్తిస్తుంది. ఈ రకమైన వెయిటింగ్ లిస్ట్ కోటా కేటాయింపు ఎక్కువగా ఉంటుంది. ఈ టికెట్లు కన్ఫార్మ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ టికెట్ GNWL కింద ఉంటే, ప్రయాణ సమయానికి ధృవీకరించబడే అవకాశం ఉంటుంది.
⦿ PQWL – పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్
పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్ అనేది బయలుదేరే స్టేషన్ నుంచి చివరి స్టేషన్ వరకు కాకుండా ఇంటర్మీడియట్ స్టేషన్ల మధ్య ప్రయాణించే ప్రయాణీకులకు జారీ చేస్తారు. ఈ కోటా టికెట్లు తక్కువగా ఉన్నందున, నిర్ధారణ అవకాశాలు మరీ ఎక్కువగా ఉండవు. ఇది ఆ మార్గంలో ప్రయాణీకుల సంఖ్యను బట్టి ఉంటుంది.
⦿ RSWL – రోడ్ సైడ్ స్టేషన్ వెయిటింగ్ లిస్ట్
రోడ్ సైడ్ స్టేషన్ వెయిటింగ్ లిస్ట్ అనేది చిన్న, రోడ్ సైడ్ స్టేషన్ల నుంచి ఎక్కే ప్రయాణీకులకు వర్తిస్తుంది. ఈ మార్గంలో చాలా తక్కువ ముఖ్యమైన స్టాప్‌లు ఉంటాయి. ఈ టికెట్లలో కన్ఫర్మేషన్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే, ఈ స్టాప్‌లకు తక్కువ సీట్లు కేటాయించబడతాయి.
ఏ వెయిటింగ్ లిస్టులో ఉంటే బెటర్?
రైలు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ వెయిటింగ్ లిస్ట్ రకాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. మీరు GNWLలో ఉన్నట్లు అయితే, RSWL, PQWL కంటే బెటర్ పొజిషన్ లో ఉన్నట్లు. మీ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ టికెట్ కన్ఫార్మ్ అయ్యిందో? లేదో? అని తెలుసుకునేందుకు తరచుగా IRCTC వెబ్ సైట్ లేదంటే యాప్ లో గమనిస్తూ ఉండాలి. ప్రయాణ తేదీ దగ్గర పడుతున్న మీ టికెట్ కన్ఫర్మేషన్ అవుతుందో? లేదో? తెలుస్తుంది.
Read Also: మూడున్నర గంటల్లో 840 కిలో మీటర్లు.. భారత్ కు బుల్లెట్ రైలు వచ్చేస్తోంది!