YS Sharmila: రాష్ట్రంలో ఇటీవల వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. ఈ ఫలితాలు ప్రజాస్వామ్యానికి సంకేతం కాదని, అధికార బలంతో సాధించిన విజయం మాత్రమేనని ఆరోపించారు.
ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు
ఎన్నికల్లో పారదర్శకత, స్వేచ్ఛ, నిష్పక్షపాతం అనే పదాలకు కూటమి పాలనలో విలువే లేకుండా పోయిందని షర్మిల మండిపడ్డారు. ఓట్లు మీరే వేసుకుని, గెలుపు మీదేనని ప్రకటించుకుంటే ఇక ఈ దేశంలో ప్రజలతో గానీ, ప్రజాస్వామ్యంతో గానీ పనేముందని ఆమె ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన అత్యున్నత ఓటు హక్కును అధికార మదంతో తొక్కిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవస్థల విధ్వంసం.. కూటమి మార్క్ రాజకీయం
రాష్ట్రంలో ఎన్నికల సంఘాన్ని ‘కూటమి సంఘం’గా మార్చేసి, పోలీస్ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని షర్మిల విమర్శించారు. రౌడీలు, గూండాలను రంగంలోకి దించి ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ.. బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికలు జరిగిన చోట కూడా దౌర్జన్యంగా బ్యాలెట్ బాక్సులను తమ స్వాధీనం చేసుకుని, ఓటరు తీర్పును తిరగరాశారని దుయ్యబట్టారు.
రాష్ట్ర పరువు తీశారు
ఈ తరహా అక్రమాలతో దేశం ముంగిట ఆంధ్రప్రదేశ్ పరువు తీసినందుకు కూటమి పార్టీలు సిగ్గుపడాలని షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిజమైన జయభేరి కాదని, ప్రజల గొంతు నొక్కి సాధించిన తాత్కాలిక విజయమని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసానికి పరాకాష్టగా నిలిచిన ఈ పరిణామాలను రాష్ట్ర ప్రజలంతా గమనించి, కూటమి నైజాన్ని గుర్తించాలని ఆమె పిలుపునిచ్చారు.
Also Read: 700 కోట్ల బడ్జెట్.. 14 లక్షల మంది మహిళలకు ఉపాధి.. రేవంత్ సర్కార్ యూనిఫామ్ విప్లవం!