Murasu Cyclone Rail Updates: మురసు తుఫాన్ దక్షిణ కోస్తాలో రైలు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఈ ఈదురు గాలుల దాటికి రైల్వే ట్రాక్‌లపై పడిన ప్రభావం వల్ల, ముఖ్యంగా కారవడి ప్రాంతంలో భద్రతా కారణ దృష్ట్యా పలు రైళ్లను నిలిపివేశారు. దక్షిణ కోస్తా రైల్వే విశాఖపట్నం కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. విజయవాడ, ఒంగోలు, గూడూరు మార్గాల్లో ప్రయాణించే అనేక ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. మరికొన్నింటి సమయాన్ని సవరించి, ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించారు.
రద్దయిన ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల వివరాలు
తుఫాన్ ధాటికి విజయవాడ – గూడూరు మార్గంలో రైలు సర్వీసులు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. బిట్రగుంట – విజయవాడ (67260), విజయవాడ – గూడూరు (17260), నెల్లూరు – విజయవాడ (17259) రైళ్లతో పాటు గూడూరు – రేణిగుంట (67203), రేణిగుంట – నెల్లూరు (67204) సర్వీసులను రైల్వే అధికారులు రద్దు చేశారు. అలాగే విజయవాడ – నరసాపురం (67258), నరసాపురం – రాజమండ్రి (67246) మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
దారి మళ్లించిన రైళ్లు
విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లే ప్రాముఖ్యమైన ‘పినాకిని ఎక్స్‌ప్రెస్’ (12711) ఉదయం 6:10 గంటలకు బయలుదేరాల్సి ఉండగా.. 2 గంటల ఆలస్యంగా ఉదయం 8:10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరింది. అలాగే కేరళ ఎక్స్‌ప్రెస్ (12625), బెంగళూరు – హతియా (18638), హౌరా – బెంగళూరు (22863), కాన్పూర్ – బెంగళూరు (04131) వంటి సుదూర ప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రత్యామ్నాయంగా రేణిగుంట-ఎర్రగుంట్ల-నంద్యాల-గుంటూరు మార్గం గుండా దారి మళ్లించారు.
ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక విజ్ఞప్తి
తుఫాన్ ఉధృతి తగ్గే వరకు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రయాణానికి సిద్ధమయ్యే ముందు ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు, తప్పనిసరిగా రైల్వే అధికారిక వెబ్సైట్ లేదా నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES) యాప్ ద్వారా తమ రైలు ప్రస్తుత రన్నింగ్ స్టేటస్‌ను సరిచూసుకోవాలని దక్షిణ కోస్తా రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.
Also Read: నాడు వై నాట్ కుప్పం.. నేడు ఫినిష్ పులివెందుల! ఏపీలో పీక్‌కి చేరిన ఈగో వార్!