Railway Disruption: దీపావళి పండుగ వేళ కాల్చిన పటాకులు రైల్వే ప్రయాణికులకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. పటాకుల కారణంగా చెలరేగిన మంటలు రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ ధ్వంసం కావడంతో ముంబైలోని వెస్ట్రన్ రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో మొత్తం 20 సిగ్నలింగ్ కేబుళ్లు దెబ్బతిన్నాయి. ఏడు సిగ్నళ్లు పని చేయడం మానేశాయి. ఈ ఎఫెక్ట్ తో 35 సబర్బన్ రైళ్లు రద్దయ్యాయి. మరో 150 రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
ఆదివారం (నవంబర్ 8) రాత్రి సుమారు 11.20 గంటల సమయంలో విరార్, నల్లాసోపారా మధ్య రైల్వే ట్రాక్ పక్కన ఈ ఘటన చోటుచేసుకుంది. పటాకుల నుంచి నిప్పురవ్వలు ఎండుగడ్డిపై పడటంతో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు 30 నిమిషాల్లోనే అగ్నిప్రమాదాన్ని పూర్తిగా అదుపు చేశారు. అయితే, మంటలు ఆరిపోయినా, అప్పటికే రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థకు నష్టం జరిగింది. దాంతో మరుసటి రోజు కూడా రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది.
ఈ ప్రమాదంలో 14 వరకు 12-కోర్ సిగ్నలింగ్ కేబుళ్లు, మరో ఆరు 6 క్వాడ్ కేబుళ్లు దెబ్బతిన్నట్లు వెస్ట్రన్ రైల్వే అధికారులు వెల్లడించారు. వీటి ద్వారా పనిచేసే మొత్తం ఏడు సిగ్నళ్లకు అంతరాయం ఏర్పడింది. దెబ్బతిన్న సిగ్నళ్లు అప్, డౌన్ త్రూ లైన్లు, లోకల్ రైల్వే లైన్లు, సైడింగ్ ప్రాంతాలకు సంబంధించినవి. వీటితో పాటు కొన్ని ట్రాక్ సర్క్యూట్లు కూడా పనిచేయడం ఆగిపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలను సాధారణంగా కొనసాగించడం సాధ్యం కాలేదు.
సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్యలు తలెత్తడంతో రైల్వే అధికారులు భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేశారు. ముంబై వైపు వెళ్లే అప్ లైన్ రైళ్లు ప్రభావిత ప్రాంతంలో రెండు సిగ్నళ్లను దాటాల్సి రావడంతో వాటి వేగాన్ని తగ్గించారు. ఈ ప్రభావం విరార్–చర్చ్ గేట్ మార్గంలో ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులపై పడింది. ఆదివారం రాత్రి నుంచే రైళ్లు ఆలస్యంగా నడవగా, సోమవారం పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. మొత్తం 35 సబర్బన్ సర్వీసులను రద్దు చేయగా, మరో 150 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. లోకల్ రైళ్లతో పాటు సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లపైనా ఈ ప్రభావం కనిపించింది.
సిగ్నలింగ్ వ్యవస్థను తిరిగి అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే సిబ్బంది రాత్రంతా శ్రమించారు. దెబ్బతిన్న కేబుళ్ల స్థానంలో కొత్త కేబుళ్లను ఏర్పాటు చేసి, ఒక్కో సిగ్నల్‌ను దశలవారీగా పునరుద్ధరించారు. సోమవారం తెల్లవారుజామున 1.38 గంటల నుంచి ఉదయం 10.45 గంటల మధ్య పలు సిగ్నళ్లు, ట్రాక్ సర్క్యూట్లు తిరిగి పనిచేయడం ప్రారంభించాయి. అయితే, పూర్తి స్థాయిలో వ్యవస్థను పునరుద్ధరించేందుకు మరమ్మతు పనులు కొనసాగాయి. ఒకవైపు పండుగ రద్దీ, మరోవైపు రైళ్ల రద్దు, ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read Also: అస్సాంలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్ ప్రెస్!