Vande Bharat Sleeper Launching: దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కబోతోంది. త్వరలోనే ఈ అత్యాధునికి సెమీ హైస్పీడ్ రైలులో ప్రయాణీకులకు జర్నీ చేసే అవకాశం లభించబోతోంది. తొలి వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభానికి సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ రైలును ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యం, అత్యధిక వేగంతో ప్రయాణం చేసే అవకాశం కలుగుతుంది. ఇప్పటికే నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి రాగా, త్వరలో స్లీపర్ రైలు రాబోతోందన్నారు.
16 కోచ్ లతో తొలి స్లీపర్ రైలు అందుబాటులోకి..
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి BEML (భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్) వందే భారత్ స్లీపర్ రైలును డెవలప్ చేసింది. ఇందులో AC ఫస్ట్ క్లాస్, AC 2-టైర్, AC 3-టైర్ సహా 16 కోచ్‌లు ఉంటాయి. వందే భారత్ స్లీపర్ గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించనుంది.
వందే భారత్ స్లీపర్ రైలు స్పెషల్ ఫీచర్లు
వందే భారత్ స్లీపర్ రైలు ప్రస్తుతం ఉన్న రైళ్లతో పోల్చితే లగ్జరీ ప్రయాణ అనుభవాన్ని అందించనుంది. ప్రయాణీకులకు సౌకర్యంతో పాటు సౌలభ్యాన్ని కల్పించనుంది. ఈ రైలులోని ఫీచర్లు అప్ గ్రేడ్ వెర్షన్లతో పాటు కొన్ని పూర్తిగా కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. స్లీపర్ రైళ్లలో ఉండే కొన్ని లక్షణాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ రియల్-టైమ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్
⦿ USB-ఇంటిగ్రేటెడ్ రీడింగ్ ల్యాంప్స్
⦿ CCTV నిఘా
⦿ మాడ్యులర్ ప్యాంట్రీలు
⦿ ఫస్ట్ AC కార్లలో వేడి నీటి షవర్లు
⦿ దివ్యాంగులకు అనుకూలమైన టాయిలెట్స్, బెర్త్ లు
⦿ టచ్ ఫ్రీ బయో వాక్యూమ్ టాయిలెట్లు
⦿ ప్రయాణికులు, రైలు సహాయకుల మధ్య కమ్యూనికేషన్ కోసం టాక్ బ్యాక్ యూనిట్లు
⦿ ఇంటర్ కనెక్టింగ్, సెన్సార్-యాక్టివేటెడ్ డోర్లు
ప్రయాణికుల భద్రతను పెంచడానికి వందే భారత్ స్లీపర్ రైలులో పలు అధునాతన లక్షణాలు ఉండనున్నాయి. ఇందులో అత్యవసర బ్రేక్ సిస్టమ్, కవచ్ యాంటీ కొలిషన్ సిస్టమ్, యాంటీ క్లైంబింగ్ టెక్నాలజీని కలిగి ఉంది.
ఫస్ట్ వందే భారత్ స్లీపర్ ఏ రూట్ లో ప్రయాణిస్తుంది?
వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి రూట్ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నిర్దిష్టంగా ఏదీ ఖరారు కాలేదు. నివేదికల ప్రకారం, న్యూఢిల్లీ-హౌరా, న్యూఢిల్లీ-ముంబై, న్యూఢిల్లీ-పుణే, న్యూఢిల్లీ-సికింద్రాబాద్ లాంటి మార్గాలు పరిశీలనలో ఉన్నాయి. వందే భారత్ స్లీపర్ రైలు విమాన ప్రయాణం లాంటి అనుభూతిని అందించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ రైళ్లు రాత్రిపూట ప్రయాణాలకు అనుగుణంగా ఉండనున్నాయి. వీటిలో ధరలు కూడా మధ్యతరగతి ప్రయాణీకులకు అందుబాటులో ఉండేలా రైల్వేశాఖ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.