Hyderabad Metro Cards: గత కొంత కాలంగా హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెరుగుతాయనే వార్తలు వినిపించాయి. తాజాగా మెట్రో సంస్థ అధికారికంగా ధరల పెంపును ప్రకటించింది. కనీసం ఛార్జీ రూ. 12గా, గరిష్ట ఛార్జీని రూ. 75కి పెంచుతూ నిర్ణయించింది. ప్రయాణీకులపై అదనపు భారం పడనుంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ గా ప్రయాణించే ప్యాసింజర్లకు క్రేజీ డిస్కౌంట్లు అందిస్తోంది మెట్రో. తక్కువ ఖర్చుతో జర్నీ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంతకీ మెట్రో అందిస్తున్న ఆఫర్లు ఏంటి? ఎలా ఉపయోగించుకోవాలి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ ఆఫ్ పీక్ సమయాల్లో 10% డిస్కౌంట్
ఉదయం 6 నుంచి ఉదయం 8 వరకు, రాత్రి 8 నుంచి 12 వరకు నాన్ పీక్ అవర్స్ గా హైదరాబాద్ మెట్రో గుర్తించింది. ఆఫ్ పీక్ అవర్స్ లో ప్రత్యేక డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. తక్కువ రద్దీ సమయాల్లో ఎక్కువ మంది మెట్రో సేవలను ఉపయోగించుకోవడంతో పాటు మెట్రో ప్రయాణాన్ని మరింత చౌకగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో ఆఫ్ పీక్ సమయాల్లో ఉపయోగించేలా కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్డులు ఉపయోగిస్తే టికెట్ ఛార్జీపై 10% డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంటుంది.
⦿ సూపర్ సేవర్ ఆఫర్ 99
రద్దీ లేని సమయాల్లో 10% తగ్గింపుతో పాటు హైదరాబాద్ మెట్రో సూపర్ సేవర్ ఆఫర్-99 పేరుతో మరో అద్భుతమైన ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ కేవలం రూ.99కే అపరిమిత ప్రయాణాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఏడాది పొడవునా 100 సెలవు దినాల్లో కేవలం రూ.99తో ప్రయాణించవచ్చు. హాలీడే రోజు తరచుగా ప్రయాణించడం, లేదంటే రవాణా ఖర్చులను ఆదా చేసుకునేందుకు ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవచ్చు.
⦿ కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డ్
స్మార్ట్ కార్డ్‌లు సింగిల్-జర్నీ టోకెన్‌లు, పేపర్ QR టిక్కెట్లపై డిస్కౌంట్ పొందే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇవి వర్చువల్ వాలెట్‌గా పనిచేస్తాయి. స్మార్ట్ కార్డ్ ఛార్జీలపై 10% తగ్గింపును అందిస్తాయి. గతంలో ఈ ఆఫర్ ను తొలిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, రీఛార్జ్ సౌలభ్యం ఉంటుంది. పదే పదే టికెట్ కొనుగోళ్లు చేయాల్సిన అవసరం లేదు. క్యూలో నిలబడకుండా త్వరగా ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది.
⦿ మెట్రో స్టూడెంట్ పాస్
విద్యార్థులు ఈ పరిమిత-ఎడిషన్ ఆఫర్ నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. 20 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 30 ట్రిప్పులు పొందే అవకాశం ఉంటుంది. ఒక్కో ట్రిప్పు ఖర్చును 33 శాతం వరకు తగ్గిస్తుంది. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య ఆయా స్టేషన్లలో అవసరమైన పత్రాలను సమర్పించి మెట్రో స్టూడెంట్ పాస్ పొందే అవకాశం ఉంటుంది.
⦿ ఫైన్, ఓవర్ స్టే ఛార్జీలను నివారించండి
టోకెన్, స్మార్ట్ కార్డ్ ను పోగొట్టుకుంటే గరిష్ట ఛార్జీతో పాటు రూ. 50 జరిమానా విధిస్తారు. ఓవర్ స్టే కూడా పెనాల్టీకి కారణం అవుతుంది. అందుకే, డిజిటల్ టికెట్లు తీసుకునేందుకు ప్రయత్నించండి. హైదరాబాద్ మెట్రో అప్పుడప్పుడు హాలిడే పాస్, స్టూడెంట్ పాస్ లాంటి డిస్కౌంట్లను అందిస్తుంది.
Read Also: పే లేటర్, ఆటో పేలతో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడం ఎలా?