Train Journey: రైల్వే ప్రయాణం అంటేనే ఉల్లాసం, ఉత్సాహ భరితంగా సాగుతుంది. అయితే రైలులో ప్రయాణించే వేళ చాలా వరకు ప్రయాణికులు నిద్రపోవడం సహజం. అలా నిద్ర పోయే ప్రయాణికులు జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమే అంటోంది ఇండియన్ రైల్వే శాఖ. ఇంతకు రైలులో ప్రయాణించే సమయంలో నిద్రవస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు పలు సూచనలు జారీ చేశారు. ఈ సూచనలు పాటించకపోతే పెను ప్రమాదం అంటూ వారు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు రైలు ప్రయాణంపై ఆసక్తి చూపుతారు. ఇలా రైలు ప్రయాణంలో ప్రయాణికులు నిద్రపోతూ ఉంటారు. అదికూడ కిటికీ ప్రక్కన కూర్చున్న వారికి అయితే బయట నుండి వచ్చే చల్లని గాలికి నిద్ర రావడం కూడ సహజం. అయితే ఇటీవల ఇలా నిద్రపోయిన వారే టార్గెట్ గా పలు చోరీలు జరిగాయి. దీనితో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రయాణీకుల నిద్రమత్తును ఆసరాగా చేసుకొని, చోరులు తమ టాలెంట్ చూపిస్తున్నారట. వీటిని అరికట్టేందుకు రైల్వే పోలీసులు ప్రతి పోలీస్ స్టేషన్ లో మైకుల ద్వార ప్రయాణికులను జాగ్రత్త పరుస్తున్నారు.
రైలులో నిద్ర పోయేవారు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..
రైలులో కిటికీ ప్రక్కన నిద్రపోయే వారు, తలను కిటికీకి ఆనించి నిద్రపోరాదని పోలీసులు సూచిస్తున్నారు. అలా నిద్రపోవడం ద్వార రైలు ఆగిన క్రమంలో, చోరులు మెడలో చైన్ లను లాగేస్తారట. అలా లాగిన క్రమంలో చైన్ తెగడంతో పాటు, మెడకు కూడ గాయమయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలుపుతున్నారు. అలాగే సెల్ ఫోన్ లు చేతిలో పట్టుకొని కిటికీల వద్ద పట్టుకొని కొందరు నిద్రపోతున్నారని, అలాంటి వారిని కూడ చోరులు బురిడి కొట్టే అవకాశం ఉందన్నారు.
Also Read: Fouling Marks In Railways: రైల్వే స్టేషన సమీపంలో FM బోర్డు.. దీని అర్థం ఏంటో తెలుసా?
అలాగే స్లీపర్ సీట్ లలో నిద్రపోయే ప్రయాణికులు, ముందుగా మన పరిసరాలలో ఉన్న వ్యక్తుల తీరును గమనించాలి. వారిలో ఏవైనా అనుమానిత కదలికలు కనిపిస్తే, పోలీసులకు సమాచారం అందించాలి. కొందరు కిటికీ వైపు తల ఉంచి నిద్ర పోతూ ఉంటారని, అటువంటి పరిస్థితిలో దొంగలు కిటికీలో నుండి చేతులు చాచి చోరీకి పాల్పడవచ్చు. అందుకు కిటికీ వైపు కాళ్ళు ఉంచి నిద్రపోవాలి. నిద్ర పోయే ముందు కిటికీలను కిందికి దించడం ద్వార, చోరీలు జరిగే అవకాశాలు అస్సలు ఉండవట. మహిళా ప్రయాణికులు అయితే తమ కాళ్లకు గల పట్టీలను భద్రపరచుకొని నిద్రలోకి వెళ్లడం ఉత్తమం. రైల్వేలో జరిగే చోరీలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు అందించిన సూచనలు పాటించి సురక్షిత ప్రయాణం సాగించాలని రైల్వే శాఖ కోరుతోంది.