Germany Plane Carsh: జర్మనీలో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. నార్త్ రైన్ వెస్ట్ ఫాలియాలోని ఒక నివాస భవనంపై విమానం కూలిపోయింది. ఈ ఘటనలో పైలెట్ సహా, ఇంట్లోని ఓ వ్యక్తి చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం మోంచెంగ్ లాడ్ బాచ్ నగరానికి సమీపంలో ఉంటుంది. డచ్ సరిహద్దుకు దగ్గరలో ఈ ప్రాంతం ఉంటుంది.
ప్రమాదం గురించి పోలీసులు ఏం చెప్పారంటే..
బీచ్ క్రాఫ్ట్ B36TC బొనాంజా (Beechcraft Bonanza) మోడల్ విమానాన్ని 71 ఏళ్ల పైలట్ నడుపుతున్నాడు. డస్సెల్డార్ఫ్ సమీపంలోని ఒక ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3:30 గంటలు) ఈ ఘటన జరిగింది. విమానం ఒక్కసారిగా పైనుంచి కిందికి జారి భవనం టెర్రస్ ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో విమానంలోని పైలెట్ తో పాటు భవనంలోని మరో వ్యక్తి చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రమాదంపై దర్యాప్తు మొదలుపెట్టిన అధికారులు
ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే అధికారులు స్పాట్ కు చేరుకున్నారు. ఎమర్జెన్సీ సర్వీస్ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. ప్రమాద కారణాలు తెలుసుకునేందుకు అధికారుల దర్యాప్తు ప్రారంభమైంది. ఈ ఘటనలో స్థానికులు షాక్ కు గురయ్యారు. సోషల్ మీడియాలో ఈఘటనకు సంబంధించిన వీడియోలో వైరల్ అయ్యాయి. జర్మన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ (BFU)కు ఈ కేసును అప్పగించారు. ప్రత్యేక బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.
Read Also: వామ్మో తత్కాలా? బెదిరిపోతున్న రైల్వే ప్రయాణీకులు!
ప్రమాద సమయంలో సాధారణ వాతావరణం
ప్రమాదం జరిగిన సమయంలో జర్మనీలో వాతావరణ పరిస్థితులు సాధారణంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం టెక్నికల్ ప్రాబ్లమ్ తో జరిగిందా? పైలట్ మిస్టేక్స్ చేశాడా? లేదంటే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ప్రమాదానికి గల పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
Read Also: రైలుకు బర్త్ డే.. కేక్ కట్ చేసిన సెలబ్రేట్ చేసిన ప్రయాణీకులు!