గోవా ప్రభుత్వం పర్యాటకుల కోసం కొత్త సర్వీస్ ప్రారంభించింది. మోటార్‌సైకిల్ టాక్సీ సర్వీస్ ఆధునికంగా మార్చేందుకు కొత్త డిజిటల్ యాప్‌ను ప్రభుత్వం లాంచ్ చేసింది. ఈ యాప్ పేరు మ్హాజే డ్రైవర్ యాప్ (Mhaje Driver App). దీన్ని 2026 జూలై 6న ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అధికారికంగా ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు సమీపంలోని బైక్ టాక్సీ డ్రైవర్లను సులభంగా కనుగొనవచ్చు. గోవాలో వీరిని సాధారణంగా “మోటార్‌సైకిల్ పైలట్లు” అని పిలుస్తారు. ఈ సేవ స్థానిక ప్రజలు, పర్యాటకులకు వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.
ఈ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లోనే సమీపంలోని బైక్ టాక్సీని వెంటనే బుక్ చేసుకోవచ్చు. ఇకపై సంప్రదాయ పైలట్ స్టాండ్‌ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదు. ప్రయాణానికి ముందే రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. దీంతో సమయం ఆదా అవుతుంది. ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. గోవాలోని పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడం కూడా సులభమవుతుంది.
ఈ యాప్ వల్ల ప్రయాణికులు మాత్రమే కాదు, బైక్ టాక్సీ డ్రైవర్లు కూడా లాభపడతారు. ఆన్‌లైన్ బుకింగ్ వల్ల వారికి ఎక్కువ మంది కస్టమర్లు దొరుకుతారు. రైడ్ల మధ్య వేచి ఉండే సమయం తగ్గుతుంది. దీంతో రోజువారీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రయాణికులు కూడా తక్కువ సమయంలో వాహనం పొందగలుగుతారు.
గోవాలో మోటార్‌సైకిల్ టాక్సీలు చాలా సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఇవి తక్కువ ఖర్చుతో ప్రయాణించే మంచి ప్రత్యామ్నంగా గుర్తింపు పొందాయి. బస్సులు తక్కువగా వెళ్లే ప్రాంతాల్లో కూడా ఈ సేవ అందుబాటులో ఉంటుంది. బీచ్‌లు, మార్కెట్లు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు టూరిస్టులు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ యాప్‌లో ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీలు మాత్రమే ఉంటాయి.
యాప్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బైక్ టాక్సీ డ్రైవర్ల సేవలను ప్రశంసించారు. వారు ప్రయాణికుల భద్రతకు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. చాలా కుటుంబాలు తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు కూడా ఈ సేవను నమ్ముతున్నాయని చెప్పారు. వారి బాధ్యతాయుతమైన సేవలకు ప్రభుత్వం అభినందనలు తెలిపింది.
ప్రారంభ దశలో బైక్ టాక్సీ డ్రైవర్లు యాప్ కోసం ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ లేని డ్రైవర్లకు సేవా సంస్థ ఫోన్లు అందిస్తుంది. ప్రయాణికులు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ ఛార్జీలనే చెల్లిస్తారు. వారు డ్రైవర్‌కు నేరుగా చెల్లింపు చేస్తారు. యాప్ ద్వారా ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయరు.
Also Read: షాపింగ్ మాల్‌లో మీకు తెలియకుండానే ఎక్కువ ఖర్చు చేస్తున్నారా? ఇదంతా మాల్ యజమాన్యం చేసే మైండ్ గేమ్
ప్రభుత్వం బైక్ టాక్సీ డ్రైవర్ల సంక్షేమానికి కొత్త ప్రతిపాదనలు కూడా పరిశీలిస్తోంది. ఎలక్ట్రిక్ బైక్‌ల కొనుగోలుకు 50 శాతం సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. అలాగే 50 సంవత్సరాలు సేవ చేసిన డ్రైవర్లకు పెన్షన్ పథకాన్ని కూడా పునరుద్ధరించే అవకాశం ఉంది. ఈ చర్యలు వారి దీర్ఘకాల సేవలకు గుర్తింపుగా ఉంటాయి.
మ్హాజే డ్రైవర్ యాప్ గోవా రవాణా రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది సంప్రదాయ బైక్ టాక్సీ సేవలకు డిజిటల్ సౌకర్యాన్ని జోడించింది. ఈ యాప్ ప్రయాణికులకు వేగవంతమైన సేవలను అందిస్తుంది. డ్రైవర్లకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం కూడా అందిస్తుంది. దీంతో గోవాలో ప్రయాణం మరింత సులభంగా, చవకగా మారే అవకాశం ఉంది.