Pahalgam Terror Attack: కాశ్మీర్ లోయలో ఉగ్రదాడి నేపథ్యంలో పర్యటకులు భయంతో వణికిపోయారు. కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన సుమారు 2 లక్షల మంది టూరిస్టులు, ప్రాణ భయంతో స్వస్థలాలకు తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అక్కడి నుంచి పర్యాటకులను సురక్షితంగా పంపించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్ము – శ్రీనగర్ మూసినప్పటికీ, పర్యాటకులను వేగంగా తరలించేందుకు కోసం పాక్షికంగా ఓపెన్ చేశారు. “పహల గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కాశ్మీర్ లోయ అత్యంత హృదయ విదారకంగా మారింది. ఈ ఘటనతో టూరిస్టులు అత్యంత వేగంగా కాశ్మీర్ నుంచి వెళ్లిపోవాలని భావిస్తున్నారు. వారు వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం” అని కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.
NH-44పై ఒకే దిశలో వాహనాల అనుమతి
అటు కాశ్మీర్ లోయ నుంచి పర్యాటకులను తరలించేందుకు డిజిసిఎ & పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అదనపు విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీనగర్- జమ్మూ మధ్య NH-44పై అధికారులు ఒకే దిశలో వాహనాలను అనుమతిస్తున్నారు. “శ్రీనగర్, జమ్మూ మధ్య పర్యాటక వాహనాలు బయలుదేరడానికి వీలుగా ట్రాఫిక్ ను సులభతరం చేయాలని అధికారులను ఆదేశించాను. రహదారి ఇప్పటికీ కొన్ని ప్రదేశాలలో సరిగా లేని కారణంగా, తగిన చర్యలు చేపడుతున్నారు. రహదారిపై ఆగి ఉన్న వాహనాలకు క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. పకడ్బందీ ఏర్పాట్ల నడుమ వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం” అని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
మూడు అంచెల భద్రత నడుమ..
ఇక శ్రీనగర్ నుంచి జమ్మూకు వెళ్లే రహదారి వెంట మూడు అంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా వేగంగా వాహనాలు వెల్లేలా చర్యలు తీసుకుంటున్నారు. అటు విమానాలతో పాటు అదనపు రైళ్లను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అన్ని విమానయాన సంస్థలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. “ఈ సున్నితమైన సమయంలో ఏ ప్రయాణీకుడిపై భారం పడకుండా చూసుకోవడానికి, విమానయాన సంస్థలు సాధారణ ఛార్జీల స్థాయిలను నిర్వహించాలని ఆదేశించాం” అని ఆయన వెల్లడించారు.
ప్రత్యేక విమానాలు, అదనపు రైళ్లు
అటు శ్రీనగర్ నుంచి ఢిల్లీ, ముంబైకి రెండు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశాం. ఇందులో ప్రయాణీకులను తరలిస్తున్నారు. కాశ్మీర్ లోయలో చిక్కుకున్న పర్యాటకుల కోసం ఏడు ప్రత్యేక విమానాలను నడిపినట్లు శ్రీనగర్ లోని అధికారులు వెల్లడించారు. ఈ విమానాలు అన్నీ పూర్తి కెపాసిటీతో నడుస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో జమ్మూ నుంచి తిరిగి వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అవసరం అయితే, అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. “జమ్మూ రైల్వే స్టేషన్ నుంచి పలు నగరాలకు రోజూ దాదాపు 40 నుండి 42 రైళ్లు నడుస్తున్నట్లు తెలిపారు. జమ్మూ స్టేషన్, శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా స్టేషన్లలో హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అటు పర్యాటక ప్రదేశాలు, హోటళ్ళు, రిసార్ట్ ల దగ్గర భద్రతను పెంచారు. దాడి నుంచి బయటపడిన వారికి పహల్గామ్ క్లబ్ లో వసతి కల్పించారు.
Read Also: పహల్ గామ్ లో ఉగ్రదాడి, పాక్ ఎంబసీలో కేక్ కటింగ్.. వీడియో వైరల్!