Vande Bharat Trains: మన దేశంలో రైలు ప్రయాణం ప్రారంభమైన దశలు చూస్తే, అది కేవలం రవాణా వ్యవస్థ మాత్రమే కాదు.. మన దేశ అభివృద్ధికి చిహ్నంగా కూడా చెప్పవచ్చు. 1853లో మొదటి రైలు ముంబయి నుండి థానేకి నడిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన రైల్వే వ్యవస్థ అనేక మార్పులు చవిచూసింది. బొగ్గు రైలు, డీజిల్, ఆపై ఎలక్ట్రిక్ ఇంజిన్లు, ఆ తర్వాత డిజిటలైజ్, ఇప్పుడు వందేభారత్ రైళ్ల వరకు ఇండియన్ రైల్వే అభివృద్ధి పథంలో నడుస్తోంది.
దేశవ్యాప్తంగా వేగవంతమైన ప్రయాణానికి మారుపేరుగా నిలుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు మరిన్ని మార్గాల్లో ప్రారంభించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తున్న ఈ రైలు, ప్రయాణికులకి అధిక వేగం, సౌకర్యం, విశ్వసనీయతను అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్పుడు కేంద్ర రైల్వే శాఖ ఈ సేవను మరింత విస్తరించేందుకు సన్నద్ధమవుతోంది.
కొత్తగా వందేభారత్ మార్గాలు ఇవే..
కత్రా – శ్రీనగర్
జమ్మూ కశ్మీర్‌లోని కత్రా నుండి శ్రీనగర్ వరకు వందే భారత్ ప్రవేశించే అవకాశం ఉంది. ఈ మార్గం ప్రారంభమైతే భక్తులకు, టూరిస్టులకు తిరుమల శ్రీనగర్ ప్రాంతానికి ప్రయాణం సులభమవుతుంది.
బెంగళూరు – బెలగావి
కర్ణాటకలోని ముఖ్యమైన నగరాలైన బెంగళూరు, బెలగావి మధ్య వందే భారత్ నడిపేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది అక్కడి వాణిజ్య కార్యకలాపాలకు గణనీయంగా తోడ్పడనుంది.
మంగళూరు – కోయంబత్తూర్, పాలక్కాడ్ – తిరువనంతపురం
దక్షిణ రైల్వే ప్రతిపాదించిన ఈ మార్గాలు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ, ప్రయాణికులకు తక్కువ సమయంలో చేరుకునే అవకాశం కల్పించనున్నాయి.
గోవా – మంగళూరు – కోజికోడ్
ప్రస్తుతం గోవా నుండి మంగళూరు వరకు వందే భారత్ ఉంది. దాన్ని కొద్దిగా విస్తరించి కోజికోడ్ వరకు పొడిగించాలని రైల్వే శాఖ పరిశీలిస్తోంది. ఇది టూరిజానికి పెరుగుదల కలిగించే మార్గంగా మారవచ్చు.
భువనేశ్వర్ – విశాఖపట్నం – కొరాపుట్
ఈ మార్గాన్ని వందే భారత్‌తో కలిపితే, ఆంధ్రా – ఒడిశా మధ్య ఉన్న ఆదివాసీ ప్రాంతాలకు వేగవంతమైన కనెక్టివిటీ లభిస్తుంది. ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రతిపాదనను మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది.
అగ్రా – అయోధ్య..
ఉత్తరప్రదేశ్‌లోని పర్యాటక, ధార్మిక ప్రాధాన్యత గల ఈ నగరాలను కలుపుతూ వందే భారత్ ప్రవేశించే అవకాశం ఉంది. ఇది వచ్చే పర్యటన సీజన్‌లో ప్రజాదరణ పొందే మార్గం కావొచ్చు.
పరిశీలనలో ఉన్న ఇతర మార్గాలు..
బెంగళూరు నుండి హైదరాబాద్ వరకు ప్రధాన ఐటీ నగరాల మధ్య వందే భారత్ నడిస్తే, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. కన్యాకుమారి నుండి శ్రీనగర్ వరకు దేశం చివర నుండి చివర వరకు వందే భారత్ ప్రయాణం కలవడం గొప్ప మైలురాయిగా మారుతుంది. ముంబై – ఇండోర్, అహ్మదాబాద్ – ఉదయపూర్, లక్నో – గోరఖ్‌పూర్, ఇవి కూడా టెస్టింగ్ దశలో ఉన్నాయి.
Also Read: Passengers Alert: వందేభారత్ ట్రైన్ లో ఇలా చేస్తే.. ఆన్ ది స్పాట్ జైలుకే!
కొత్తగా వస్తున్న స్లీపర్ వర్షన్లు
ఇప్పటి వరకు వందే భారత్ అన్ని రోజూ ప్రయాణించేవే. కానీ రాత్రి ప్రయాణాల కోసం ప్రత్యేకంగా స్లీపర్ వర్షన్ వందే భారత్ రైళ్లు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు ఉన్నాయి. ఈ స్లీపర్ ట్రైన్లు 2025లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తం 10 స్లీపర్ రైళ్లు దేశవ్యాప్తంగా నడవనున్నాయి. మొత్తం మీద వందే భారత్ రైళ్ల ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.
వేగవంతమైన రైలు కనెక్టివిటీతో పాటు, టూరిజానికి, వ్యాపారానికి లాభదాయకంగా వందే భారత్ రైళ్లు నిలవనున్నాయని చెప్పవచ్చు. వందే భారత్ ఇప్పుడు ఓ బ్రాండ్ గా గుర్తింపు పొందింది. ఈ రైలు అందిస్తున్న వేగం, సౌకర్యాలకు ప్రయాణికులు ముగ్ధులవుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మార్గాల్లో వందే భారత్ ప్రవేశిస్తే.. భారత రైల్వే చరిత్రలో ఇది స్వర్ణ యుగంగా నిలిచిపోతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.