Rain alert: గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు చల్లటి న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి వేళ ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వాతావరణ శాఖ అధికారులు అంచనాల ప్రకారం.. ఈ రోజు రాత్రి, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వివరించారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో వీచే అవకాశం ఉందని చెప్పారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరికలు జారీ చేశారు. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నట్టు అధికారులు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెప్పారు.
వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో ఈ రోజు ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడిందని చెప్పారు. నిన్న ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈ రోజు సగటు సముద్ర మట్టం నుండి 1.5 నుండి 5.8 కి మీ ఎత్తులో కొనసాగుతోందని అన్నారు. దానికి తోడు కోస్తా ఆంధ్ర తీరం వద్ద ద్రోణి కూడా ఏర్పడినట్టు వారు వివరించారు.
Also Read: MP Raghunandan Rao: రేవంత్ సర్కార్ పాలనపై ఎంపీ రఘునందన్ ప్రశంసలు.. వీడియో వైరల్
అటు రాయలసీమలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కర్నూలు నగరంలో ఈ రోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. దీంతో నగరంలోని రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో.. వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.