Nepal and Bhutan Travel Rules 2026: నేపాల్, భూటాన్ దేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈ రెండు దేశాలకు ప్రయాణించే వారి గుర్తింపు పత్రాలకు సంబంధించి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై విమానంలో వెళ్లినా, రోడ్డు మార్గంలో ప్రయాణించినా కొన్ని గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. నవంబర్ 5న కేంద్ర హోంశాఖ (MHA) ఈ మేరకు సవరించిన ఉత్తర్వులను జారీ చేసింది. సో, ఖాఠ్మండు, పోఖారా, పారో, థింపూ లాంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు ప్రయాణానికి ముందే కొత్త రూల్స్ గురించి తెలుసుకోవడం మంచిది.
భారతీయులకు నేపాల్, భూటాన్ దేశాలకు వెళ్లేందుకు సాధారణ పాస్‌పోర్ట్ తప్పనిసరి కాదు. గతంలో ఉన్న ఈ వెసులుబాటును ప్రభుత్వం కొనసాగించింది. అయితే, ప్రయాణికులు తమ గుర్తింపు కోసం ప్రభుత్వం ఆమోదించిన పత్రాల్లో ఏదో ఒకటి చూపించాలి. కొత్త నిబంధనల ప్రకారం, భారత్ నుంచి నేపాల్, భూటాన్‌కు వెళ్లేవారు, అక్కడి నుంచి తిరిగి భారత్‌కు వచ్చేవారు ఇమ్మిగ్రేషన్ అధికారులకు తమ ఐడెంటీ కార్డులు చూపించాలి. ఈ నిబంధనలు విమాన ప్రయాణంతో పాటు రోడ్డు మార్గంలో వెళ్లేవారికి కూడా వర్తిస్తాయి. అయితే, ప్రభుత్వం జారీ చేసిన ప్రతి గుర్తింపు కార్డును ప్రయాణానికి ఉపయోగించవచ్చని భావించకూడదు. వీసా మాన్యువల్ లో ప్రభుత్వం సూచించిన డాక్యుమెంట్స్ మాత్రమే చూపించాలి. అవసరమైతే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇతర వివరాలను కూడా అడగవచ్చు.
నేపాల్, భూటాన్ మీదుగా మరో దేశానికి వెళ్లాలనుకునే భారతీయులకు ఈ మినహాయింపు వర్తించదు. నేపాల్ మీదుగా థాయ్‌లాండ్, ఇతర దేశాలకు వెళ్లినా, తిరిగి భారత్ కు వచ్చినా చెల్లుబాటు అయ్యే పాస్ పోర్ట్ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా, నిర్దేశించిన ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టుల ద్వారానే రాకపోకలు సాగించాలి.
ఈ మార్పులు భారతీయులకే పరిమితం కాలేదు. నేపాల్, భూటాన్ పౌరులు కూడా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు, ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు వీసా మాన్యువల్‌లో పేర్కొన్న గుర్తింపు పత్రాలను చూపించాలి. అయితే, నేపాల్, భూటాన్ కాకుండా ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే ఆ దేశాల పౌరులు చెల్లుబాటు అయ్యే పాస్ పోర్ట్ కలిగి ఉండాలి. చైనా, మకావు, హాంకాంగ్, పాకిస్తాన్ నుంచి ప్రయాణించే వారికి పాస్ పోర్ట్ తో పాటు వ్యాలీడ్ అయ్యే వీసా కూడా తప్పనిసరి.
నేపాల్, భూటాన్ పర్యటనకు టికెట్లు బుక్ చేసుకునే ముందు ప్రభుత్వం సూచించిన గుర్తింపు పత్రాలను దగ్గర పెట్టుకోవడం మంచిది. ప్రయాణ సమయంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. విమానయాన సంస్థలు, ఇమ్మిగ్రేషన్ అధికారుల లేటెస్ట్ గైడ్ లైన్స్ కూడా తెలుసుకోవాలి. భారతీయులకు నేపాల్, భూటాన్ వెళ్లేందుకు వీసా, సాధారణ పాస్ పోర్ట్ మినహాయింపు కొనసాగుతున్నప్పటికీ, గుర్తింపు పత్రాల విషయంలో కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.
Read Also: ఇక్కడ ఇళ్లన్నీ మట్టితోనే కట్టారు.. అయినా వందల ఏళ్లుగా చెక్కుచెదరలేదు!