Hill Stations: వేసవికాలం రాగానే మనలో చాలా మంది ఊటీ, కొడైకెనాల్ లాంటి హిల్ స్టేషన్లకు టూర్లు ప్లాన్ చేసుకుంటాం. ఈ ఎండ వేడిని మరచి ఆ చల్లని వాతావరణంలో కొన్నిరోజులు బాగా ఎంజాయ్ చేసి రావాలి అనుకుంటాం. అయితే, మన భారతదేశంలో ఊటీ లాంటి చల్లని ప్రదేశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని హిల్ స్టేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కూనూర్
ఇది తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 1850 మీటర్ల ఎత్తులో ఉంది. కూనూర్ పచ్చని తేయాకు తోటలు, జలపాతాలు, హైకింగ్ ట్రైల్స్ తో చాలా ఫేమస్. ఇక్కడి సిమ్స్ పార్క్, లాంబ్స్ రాక్, డాల్ఫిన్ నోస్ లాంటి టూరిస్ట్ ప్లేసెస్ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటాయి. ఇక్కడి చల్లని వాతావరణం, అందమైన దృశ్యాలతో ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు ఈ హిల్ స్టేషన్ సమ్మర్ టూర్ ప్లాన్ చేసుకోవడానికి మంచి చాయిస్.
యెర్కాడ్
తమిళనాడులోని సేలం జిల్లాలో షెవరాయ్ కొండల్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ హిల్ స్టేషన్. ఇది సముద్ర మట్టానికి 1515 మీటర్ల ఎత్తులో ఉంది. యెర్కాడ్ హిల్ స్టేషన్ ను పూర్ మ్యాన్స్ హిల్ స్టేషన్ అని కూడా పిలుస్తారు. ఈ హిల్ స్టేషన్ పచ్చని అడవులు, కాఫీ, మిరియాల తోటలు, సుగంధ ద్రవ్యాల సుగంధంతో ఆకట్టుకుంటుంది. ఇక్కడి యెర్కాడ్ లేక్, లేడీస్ సీట్, కిల్లియూర్ వాటర్ ఫాల్స్, పగోడా పాయింట్ వంటి టూరిస్ట్ ప్లేసెస్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ట్రెక్కింగ్, బోటింగ్ కు ఈ ప్లేస్ చాలా పాపులర్. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులు ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉంటుంది.
హార్స్లీ హిల్స్
ఏపీలోని చిత్తూర్ జిల్లాలో 1265 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ఆకర్షణీయమైన హిల్ స్టేషన్. ఆంధ్ర ఊటీ అని పిలిచే ఈ ప్లేస్ సహజ సౌందర్యం, చల్లని వాతావరణంతో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అడవులు, యూకలిప్టస్ చెట్లు, గంగానమ్మ ఆలయం, కౌండిన్య వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సెంటర్ ఇక్కడి ఫేమస్ స్పాట్స్. ట్రెక్కింగ్, జిప్ – లైనింగ్, రాపెల్లింగ్ వంటి అడ్వెంచర్లకు ఈ ప్లేస్ చాలా అనువైనది. ప్రశాంతమైన వాతావరణం, పక్షుల కిల కిల శబ్దాలతో విశ్రాంతి, సాహసం కోరుకునేవారికి ఈ హిల్ స్టేషన్ మంచి ఛాయిస్ అని పర్యాటకులు చెబుతున్నారు.
అరకు లోయ
అల్లూరి సీతారామరాజు జిల్లాలో సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక అద్భుతమైన హిల్ స్టేషన్. దీన్ని ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు. ఇది విశాఖపట్నంకు 114 కి.మీ దూరంలో ఉంది. ఈస్టర్న్ ఘాట్స్‌లో పచ్చని ప్రకృతి అందాలు, జలపాతాలు, కాఫీ తోటలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ బొర్రా కేవ్స్, చపరాయి జలపాతం, పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం ఫేమస్ స్పాట్స్. అరకు ఎమరాల్డ్ కాఫీ బ్రాండ్ ఇక్కడి రైతుల సేంద్రీయ ఉత్పత్తి. రైలు, రోడ్డు మార్గాల ద్వారా సులభంగా చేరుకునే ఈ హిల్ స్టేషన్ శీతాకాలంలో సందర్శనకు మంచి సమయం. ఇక్కడి గిరిజన సంస్కృతి, ధింసా నృత్యం, ప్రకృతి అందాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.