CM Revanth Reddy : కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్.. మూడు జోన్లుగా తెలంగాణను విభజించి అభివృద్ధి సాధిస్తామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. 2047 నాటికి ఇండస్ట్రీ, ఇన్‌ఫ్రా రంగంలో అంతర్జాతీయ నగరాల సరసన తెలంగాణను నిలబెడతామని చెప్పారు. తెలంగాణ రైజింగ్ – 2047 విజన్‌తో ముందుకు సాగుతున్నామని తెలిపారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో అమెరికా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, దావోస్‌లో పర్యటించి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించామని వెల్లడించారు. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణపై తన కార్యచరణను వివరించారు.
తెలంగాణ రైజింగ్ విజన్
తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని మూడు జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని చెప్పారు. వీటిలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, మెట్రో రైల్ సెకండ్ ఫేజ్, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మాన్యూఫాక్చరింగ్ హబ్, అగ్రిబేస్డ్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. సబర్మతీ రివర్ ఫ్రంట్, గంగా పునరుద్ధరణ ప్రాజెక్ట్ మాదిరిగానే తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందని తెలిపారు. మెట్రో సెకండ్ ఫేజ్, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులు ప్రస్తుతం డీపీఆర్‌ల స్టేజ్‌లో ఉన్నాయన్నారు. రేడియల్ రోడ్ల నిర్మాణం, ప్రతిపాదిత డ్రై పోర్ట్ నుంచి మచిలీపట్నం పోర్టుకు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం.. తెలంగాణ డెవలప్‌మెంట్‌లో కీలకంగా మారనుందని అన్నారు. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలనలు.. తెలంగాణ రైజింగ్ విజన్‌లోని 4 కీలక అంశాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సూపర్ పవర్‌గా ఇండియా..
పహల్గాంలో మారణకాండ సృష్టించిన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టినందుకు భారత సైన్యానికి, ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి. 1971లో శ్రీమతి ఇందిరాగాంధీ నాయకత్వంలో పాకిస్తాన్‌ను ఓడించి, ఆ దేశాన్ని రెండు ముక్కలుగా చీల్చిన చరిత్రను గుర్తు చేశారు. 2047 నాటికి ఇండియాను సూపర్ పవర్‌గా, నెంబర్ వన్‌గా నిలబెట్టాలన్న మోదీ సంకల్పాన్ని సీఎం స్వాగతించారు. అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని.. ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని చెప్పారు.
యువతకు రూ.5 లక్షలు.. జూన్ 2 నుంచే ప్రారంభం..
తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణన, బీసీలకు 42% రిజర్వేషన్‌లు, ఎస్సీల ఉప వర్గీకరణకు ప్రజాప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. దేశవ్యాప్త కుల గణనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. కులగణనలో తెలంగాణ అనుభవాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను సిద్ధం చేసి కార్యాచరణలో పెట్టినట్లు తెలిపారు. 2028 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు రూ.5 లక్షల స్వయం ఉపాధి పథకాన్ని జూన్ 2 నుంచి ప్రారంభిస్తామన్నారు.
కేంద్రం సపోర్ట్ కావాలి..
వికసిత భారత్ లక్ష్య సాధన మనందరి ఆశయం.. అందులో తెలంగాణ కీలక పాత్ర పోషించాలనేదే మా ఆకాంక్ష. నేషన్ ఫస్ట్ – పీపుల్ ఫస్ట్.. అన్న ప్రాధాన్యతతో ముందుకు వెళుతున్నామన్నారు సీఎం రేవంత్. కేంద్రం సహాయం, సహకారం లేకుండా తెలంగాణ రైజింగ్ విజన్ అమలు చేయలేమన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి సహకరించమని కోరారు.
Attended the #NitiAayog Governing Council meeting in the national capital today. Joined the Hon’ble Prime Minister, several union ministers, and other Chief Ministers in discussing the vision and future of #India.
In my address, the first time #Telangana is being represented in… pic.twitter.com/KoqEVp9gOi
— Revanth Reddy (@revanth_anumula) May 24, 2025