Secundrabad Railway Stationistory History: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. 150 ఏండ్లకు పైగా చరిత్ర ఉన్నఈ రైల్వే స్టేషన్ కనిపించకుండాపోతోంది. ఆధునికీకరణలో భాగంగా పాత స్టేషన్ ను పూర్తిగా కూల్చివేసి కొత్త స్టేషన్ ను నిర్మించబోతున్నారు అధికారులు. ఇప్పటికే కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఐకానిక్ రైల్వే స్టేషన్ ముందు భాగం కూల్చివేత ఇవాళ మొదలయ్యింది. కూల్చివేత పూర్తయ్యాక, సరికొత్త హంగులతో కొత్త రైల్వే స్టేషన్ రూపుదిద్దుకోబోతోంది. అత్యాధునిక సౌకర్యాలు, ప్రపంచ స్థాయి వసతులతో నిర్మాణం కానుంది.
అత్యంత ఆదాయం వచ్చే స్టేషన్లలో ఒకటి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దక్షిణ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే ముఖ్యమై రైల్వే కేంద్రాలలో ఒకటిగా కొనసాగుతోంది. దక్కన్ ప్రాంతంతో పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాల మధ్య కీలకమైన లింక్ గా కొనసాగుతోంది. ఈ రైల్వే స్టేషన్ లో మొత్తం 10 ప్లాట్ ఫారమ్ లు ఉండేవి. ఇక్కడి నుంచి రోజూ 230 కి పైగా రైళ్లు రాకపోకలు కొనసాగించేవి. నిత్యం 2 లక్షల మంది ఇక్కడి నుంచి ప్రయాణించేవారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆదాయంలో నాలుగో స్థానంలో నిలిచింది. 2023-24లో ఈ రైల్వే స్టేషన్ ద్వారా రైల్వే సంస్థకు ఏకంగా రూ. 1,276 కోట్ల ఆదాయం లభించింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చరిత్ర
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను 1874లో స్థాపించారు. హైదరాబాద్ రూలర్ నిజాం అసఫ్ జా VI పాలనలో నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే (NGSR) ఆధ్వర్యంలో ఈ స్టేషన్ ను నిర్మించారు. ఈ స్టేషన్ నిర్మాణం బ్రిటిష్, ఇండో-సార్సెనిక్ శైలిలో నిర్మించారు. హైదరాబాద్ రాష్ట్రంలో వాణిజ్యం, రవాణాను మెరుగుపరచడానికి దీనిని నిర్మించారు. ఈ రైల్వే లైన్ ప్రారంభంలో సికింద్రాబాద్ ను కర్నాటకలోని వాడితో కనెక్ట్ చేయడానికి ఉపయోగించారు. సికింద్రాబాద్ నుంచి మొదటి రైలు 1874లో వాడి జంక్షన్ వరకు నడిచింది. వాడి కర్ణాటకలోని కలబురగి(గుల్బర్గా) జిల్లాలోని ఒక పట్టణం. ఇది దక్షిణ మధ్య రైల్వే (SCR) నెట్ వర్క్ ముఖ్యమైన రైల్వే జంక్షన్ గా కొనసాగుతోంది. ముంబై, హైదరాబాద్, చెన్నై మధ్య ప్రధాన మార్గాలను ఈ జంక్షన్ కలుపుతుంది. హైదరాబాద్ నుంచి 150 కి.మీ కలబురగి (గుల్బర్గా) దూరంలో ఉంటుంది. ఈ ప్రాతంలో సున్నపురాయి నిక్షేపాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పట్టణంలో సిమెంట్ పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విస్తరణ
దశాబ్దాలుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విస్తరించి దేశంలోనే అత్యంత ముఖ్యమైన స్టేషన్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. 20వ శతాబ్దంలో బ్రాడ్ గేజ్ లైన్లు, విద్యుదీకరణ ప్రారంభంకావడంతో స్టేషన్ వేగంగా విస్తరించింది. 1966లో సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) ప్రధాన కార్యాలయంగా మారింది. ఆ తర్వాత దీని ప్రధాన్యత మరింత పెరిగింది. 2003లో మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ (MMTS) ప్రవేశపెట్టడం వల్ల హైదరాబాద్, సికింద్రాబాద్ మధ్య కనెక్టివిటీ మెరుగుపడింది.
కొనసాగుతున్న పునరాభివృద్ధి పనులు
ఇక పెరుగుతున్న ప్రయాణీకుల డిమాండ్ కు అనుగుణంగా దీనిని తీర్చి దిద్దేందుకు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ ను పునర్నిస్తున్నది. ఇందుకోసం ఏకంగా రూ. 715 కోట్లు కేటాయించింది. పాత స్టేషన్ ను పూర్తిగా కూల్చివేస్తోంది. దాని స్థానంలో అత్యాధునిక రైల్వే స్టేషన్ ను నిర్మిస్తోంది.
⦿ కొత్త రైల్వే స్టేషన్ ను పెరిగిన ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా మల్టీ లెవెల్ టెర్మినల్ బిల్డింగ్ ను నిర్మిస్తున్నారు.
⦿ అద్భుతమైన వెయిటింగ్ లాంజ్‌లు, ఫుడ్ కోర్టులు, ఆధునిక టికెటింగ్ కౌంటర్లు నిర్మిస్తున్నారు.
⦿ రద్దీని మెయింటెయిన్ చేయడానికి సరికొత్త ఎంట్రీ, ఎగ్జిట్ టెర్మినల్స్ ను రూపొందిస్తున్నారు.
⦿ మెరుగైన రూఫింగ్, సీటింగ్, లైటింగ్ తో ప్లాట్ ఫామ్ లను అప్ గ్రేడ్ చేస్తున్నారు.
⦿ ప్రయాణీకుల రాకపోకలను మెరుగుపరచడానికి ఫుట్-ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్ల విస్తరిస్తున్నారు.
⦿ ప్రీమియం లాంజ్‌లు, డిజిటల్ ఇన్ఫర్మేషన్ బోర్డులతో సహా విమానాశ్రయం లాంటి సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు.
⦿ రైల్వే స్టేషన్ అవసరాలకు సరిపడ విద్యుత్ అవసరాలు తీర్చేందుకు సోలార్ ప్యానల్స్, లైటింగ్ ను అమర్చనున్నారు.
⦿ స్టేషన్ ను మరింత పర్యావరణ అనుకూలంగా మార్చడానికి వ్యర్థాల నిర్వహణ, వాటర్ రీసైక్లింగ్ వ్యవస్థలను మెరుగుపరుస్తున్నారు.
⦿ స్టేషన్ కు ఈజీగా రాకపోకలు కొనసాగించేందుకు కొత్త రోడ్లు, మెట్రో కనెక్టివిటీ ప్రాజెక్టులను ఏకీకృతం చేస్తున్నారు.
⦿ పెరుగుతున్న వాహనాల రద్దీని మేనేజ్ చేసేందుకు పార్కింగ్ స్థలాలు, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.
మొత్తంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చారిత్రక రైల్వే హబ్ నుంచి ఆధునిక రవాణా కేంద్రంగా రూపొందుతోంది. పునర్నిర్మాణంతో దేశంలోని అత్యంత అధునాతన రైల్వే హబ్ లలో ఒకటిగా మారబోతోంది. ప్రయాణీకులకు మెరుగైన సౌలభ్యం, ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించబోతోంది.
Read Also: 13 గంటల జర్నీ.. 5 గంటల్లోనే.. ఆ రూట్లో వందే భారత్ సరికొత్త రికార్డు!