Tourism in AP: ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టూరిజం హబ్‌గా మార్చాలని చంద్రబాబు సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఉన్న అన్నిరకాల వనరులను ఉపయోగించుకుంటోంది. తాజాగా హౌస్ బోట్లను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. పగలంతా జల విహారం.. రాత్రి వేళ అందులో టూరిస్టులు విశ్రాంతి తీసుకోవచ్చు. వినడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం.
టూరిజంపై ఏపీ సర్కార్ దృష్టి
చంద్రబాబు సర్కార్ టూరిజంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఓ వైపు టెంట్ సిటీలు, ఇంకోవైపు గ్రామీణ టూరిజం (పల్లెల్లో హోమ్ స్టే) మరోవైపు సీ ప్లేన్లు-హౌస్ బోట్లు ఇలా రకరకాలుగా ఆలోచనలు చేస్తోంది. టూరిస్టులను అధికంగా ఆకట్టుకోవాలన్నది ప్రభుత్వం ప్లాన్. వచ్చే నెలలో కొన్ని మొదలుకానుండగా, జనవరి చివరి నాటికి పైన చెప్పిన అన్ని విభాగాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. పనులు అంతేవేగంగా జరుగుతున్నాయి.
వీలైతే ఫ్యామిలీ సభ్యులు.. కుదరకపోతే ఫ్రెండ్స్‌తో కలిసి పగలు జల విహారం, రాత్రి వేళ జలాలపై రెస్టు తీసుకునేలా హౌస్ బోట్లను ఏర్పాటు చేస్తోంది. ఆ తరహా కాన్సెప్ట్ కేరళలో ఎక్కువగా ఫేమస్ అయ్యింది. అంతేకాదు మ్యారేజ్ తర్వాత కొత్త జంటలు ఎక్కువగా ఆ ప్రాంతానికి వెళ్లడానికి ఇదీ కూడా ఓ కారణం. ఇప్పుడు ఏపీ టూరిజం అటు వైపు ఫోకస్ చేసింది.
గ్లోబల్ టూరిజం హబ్‌గా ఏపీ
కేరళలో కనిపించే హౌస్ బోట్ పర్యాటకాన్ని ఏపీ ప్రజలకు చేరువ చేసేలా చర్యలు మొదలయ్యాయి. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో కడపలోని గండికోట, బాపట్లలోని సూర్యలంక, రాజమహేంద్రవరం గోదావరి, విజయవాడలోని భవానీ ఐలాండ్ వంటి ప్రాంతాలను ఎంపిక చేసింది. సంక్రాంతి నాటికి ఆయా ప్రాంతాల్లో ఐదు హౌస్ బోట్లు సేవలు మొదలుకానున్నాయి.
అడ్వెంచర్ టూరిజంలో భాగంగా వీటి కోసం కేరళతోపాటు ఏపీకి చెందిన కొన్ని ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చాయి. రాష్ట్ర పర్యాటక శాఖతో ఒప్పందం చేసుకున్నాయి. పది చోట్ల హౌస్ బోట్లు నడపాలని అధికారులు ప్రతిపాదన చేశారు. నదులు, జలాశయాలు, సముద్ర బ్యాక్ వాటర్‌లో సాధ్యాసాధ్యాల పరిశీలన తర్వాత తొలి దశలో నాలుగు చోట్ల నడపాలని నిర్ణయించారు.
ALSO READ: టికెట్లు లేని ప్రయాణంపై రైల్వే ఉక్కుపాదం
ఎంపిక చేసిన మార్గంలో 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం హౌస్ బోట్లను నడుపుతారు. మధ్యాహ్నం బోటు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు తిరిగొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. రాత్రంతా బోటులో భోజనం, వసతి వంటి సదుపాయాలు ఉండనున్నాయి. ఒక్కో హౌస్ బోటులో నలుగురు వరకు ప్రయాణం చేయవచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో డబుల్ బెడ్‌రూం లగ్జరీ హౌస్ బోట్లు నడిపేందుకు ప్రైవేట్ ఆపరేటర్లను టూరిజం శాఖ ఆహ్వానిస్తోంది. గతంలో ఈ ప్రాంతంలో రెండు హౌస్ బోట్లు ప్రారంభించిన విషయం తెల్సిందే.
గండికోట నుంచి మైలవరం డ్యామ్ వరకు జర్నీ మొదలుకానుంది. గండికోట జలాశయం నుంచి బోటు బయలు దేరుతుంది. గండికోట, అగస్థేశ్వరం మీదుగా మైలవరం డ్యామ్‌కి వెళ్తుంది. మధ్యంలో గండికోట అందాలతోపాటు అగస్థేశ్వరంలో శివాలయంలో దర్శనం చేసుకోవచ్చు. మళ్లీ ఆ మార్గంలో తిరుగు పయనం అవుతాయి.
సూర్యలంక నుంచి నిజాంపట్నం వరకు ఉంటుంది. సూర్యలంక నుంచి మధ్యాహ్నం బయలుదేరి మడ అడవుల మీదుగా నిజాంపట్నం వరకు బోటు వెళ్తుంది. రాత్రికి అక్కడే బస ఉంటుంది. సూర్యోదయ సమయంలో నిజాంపట్నం నుంచి తిరిగి బయలుదేరుతుంది.
రాజమహేంద్రవరం నుంచి ధవళేశ్వరం మీదుగా హౌస్ బోట్లు ప్లాన్. గోదావరి నుంచి పద్మావతి, సరస్వతి ఘాట్‌ల నుంచి బోట్లు బయలు దేరతాయి. పిచ్చుక లంక, బ్రిడ్డి లంకల మీదుగా ధవళేశ్వరం చేరుకుంటాయి. గోదావరి అందాలను తిలకిస్తూ అదే మార్గంలో తిరిగి బోట్లు వెనక్కి వస్తాయన్నమాట. అంతా అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి తర్వాత హౌస్ బోట్ల టూరిజం అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తోంది ప్రభుత్వం. దీనివల్ల స్థానిక ప్రాంతాలు అభివృద్ధి, ఆ ప్రాంత ప్రజలకు జీవనోపాధి కలగనుంది.