ప్రయాణ సమయంలో తరచుగా మేకులు గుచ్చుకుని బైకులు, కార్లు, ఇతర వాహనాలు పంక్చర్ అవుతాయి. వాటిని దగ్గరలోని పంక్చర్ షాపులలో రిపేర్ చేయించుకు వెళ్లిపోతారు. కానీ, కొంత మంది పంక్చర్ దుకాణాలు నడిపే వ్యక్తులు కావాలని రోడ్డు మీద షార్ప్ మేకులు వేసి వాహనాలు పంక్చర్ అయ్యేలా కుట్ర చేస్తున్నారు. పంక్చర్ అయిన వాహనాలకు తమ దుకాణాల్లోనే రిపేర్లు చేసి వాహనదారుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వాహనదారుడు ఈ తతంతగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రయాణీకులు అలర్ట్ గా ఉండాలని సూచించాడు.
బెంగళూరులోని ఓ ఫ్లై ఓవర్ మీద ఉద్దేశపూర్వకంగా మేకులు చల్లినట్లు చూపించే వీడియో ఒక నెట్టింట వైరల్ గా మారింది. వాహనదారులను దోపిడీ చేయడమే లక్ష్యంగా కొంత మంది పంక్చర్ దుకాణాల యజమానులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు ఓ ప్రయాణీకుడు వెల్లడించాడు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో మందరగిరి కొండ సమీపంలోని బెంగళూరు ఫ్లై ఓవర్ మీద తీశారు. ఈ వీడియో వాహనదారులను ఆందోళనకు గురి చేస్తుంది. టూర్ కు వెళ్లి వస్తున్న కొంత మంది బైక్ రైడర్లు ఈ ఘటనను వెలుగులోకి తెచ్చారు. IKEA షోరూమ్ కు సమీపంలో ఉన్న రోడ్డు మీద మేకు గుచ్చుకోవడంతో అకస్మాత్తుగా టైర్ పంక్చర్ అయినట్లు సదరు బృందం వెల్లడించింది. అదృష్టవశాత్తూ, తమ దగ్గర స్పేర్ ట్యూబ్ ఉండటంతో వెంటనే మార్చినట్లు చెప్పింది.
బైక్ రైడర్స్ టీమ్ లో ఒకరికి అనుమానం కలిగి.. వాళ్లు బైక్ పంక్చర్ అయిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆ సమయంలో రోడ్డు మీద చెల్లాచెదురుగా పడి ఉన్న షార్ప్ మేకులను గుర్తించారు. ఈ మేకుల గురించి ప్రయాణీకులను అలర్ట్ చేసేందుకు ఆ యువకులు ఈతతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. డజన్ల కొద్దీ మేకులు ఉద్దేశపూర్వకంగానే ప్లై ఓవర్ మీద ఉంచారని వెల్లడించారు. వాహనదారులను ట్రాప్ చేసేందుకు కొంత మంది కావాలని ఇలా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సదరు యువకులు బెంగళూరు పోలీసులకు ట్యాగ్ చేశారు. పోలీసులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. లేదంటే, ఎంతో మంది వాహనదారుల ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నారు.
🚨 SCAM ALERT for Bengaluru Citizens 🚨
⚠️ Public Awareness Message ⚠️A recent shocking incident has come to light near Mandaragiri Hill, and it serves as an urgent warning for all motorists and two-wheeler riders in Bengaluru.A group of people who had gone for an outing… pic.twitter.com/zG09cmnTPp
— Karnataka Portfolio (@karnatakaportf) October 6, 2025
ఈ వీడియో ప్రస్తుతం 60 వేలకు పైగా వ్యూస్ సాధించింది. “నిజంగా ఇది దారుణం. ఎంతో మంది వాహనదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అధికారులు త్వరగా ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. బెంగళూరు అంతటా ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు మరికొంత మంది నెటిజన్లు వెల్లడించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేశారో అంతే సంగతులు, సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్!