BigTV English

Japan Trains: జపాన్‌ రైలు నెట్‌వర్క్ ప్రపంచంలోనే బెస్ట్.. వాళ్లు ఏం చేస్తున్నారో తెలిస్తే మతిపోద్ది!

Japan Trains: జపాన్‌ రైలు నెట్‌వర్క్ ప్రపంచంలోనే బెస్ట్.. వాళ్లు ఏం చేస్తున్నారో తెలిస్తే మతిపోద్ది!

మీరు ఎక్కవలసిన రైలు జీవిత కాలం లేటు అనేది మన దగ్గర ఉన్న నానుడి. అంటే మన దేశంలో రైళ్లు సమయానికి రావడం అరుదు అని దానర్థం. ఇక ఆలస్యం విషయానికొస్తే అది ఒక నిమిషం కావొచ్చు, ఒక గంట కావచ్చు, ఒక పూట కావచ్చు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఒక రోజు కూడా కావొచ్చు. పోనీ ఆలస్యంగా వచ్చినా పర్లేదు, కాస్త పరిశుభ్రంగా ఉంటాయా అంటే.. దీనికి సమాధానం వేరెవరో చెప్పాల్సిన పనిలేదు. భారత దేశంలో రైలు ఎక్కిన ప్రతి ప్రయాణికుడికీ అది ప్రత్యక్ష అనుభవమే. ఆలస్యం అయినా పర్లేదు, పరిశుభ్రంగా లేకపోయినా పర్లేదు, కనీసం తాము ఎక్కడికి వెళ్లాలో ఆ ప్రాంతానికి రైలు సౌకర్యం ఉంటే చాలు అనుకుంటారా..? అది కూడా కష్టమే. భారత్ లో రైళ్ల కనెక్టివిటీ అన్ని ప్రాంతాలకు లేదు. రైలు ఎక్కినా నేరుగా మన గమ్యం చేరుకుంటామని అనుకోలేం, ఆ తర్వాత బస్సు, ఆ తర్వాత ఆటో.. ఇలా సాగుతుంది మన ప్రయాణం.


భారత్ లోనే కాదు..
రైళ్ల విషయంలో ప్రయాణికుల అవస్థలు కేవలం భారత్ లోనే కాదు.. అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఇలాంటి ఇబ్బందులున్నాయి. అమెరికాలో రైల్వే వ్యవస్థను అమ్ ట్రాక్ అనే పేరుతో పిలుస్తారు. ఈ అమ్ ట్రాక్ వ్యవస్థలో కూడా లోపాలున్నాయి. రైళ్లు ఆలస్యమవుతాయి, పరిశుభ్రత విషయంలో రాజీ పడాల్సి రావొచ్చు, కొన్నిసార్లు రైళ్లు రద్దయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. బ్రిటన్ లో కూడా ఈ సమస్యలున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, చైనాలో బుల్లెట్ ట్రైన్స్ ఉన్నా కూడా అప్పుడప్పుడూ అవి ఆలస్యంగా నడుస్తుంటాయి. అసలు రైలు అంటే ఆలస్యమేనా, అపరిశుభ్ర వాతావరణం కామన్ గా కనపడేదేనా..? కాదు. ఒక్క దేశం మాత్రం దీనికి మినహాయింపు. అదే జపాన్.

జపాన్ గ్రేట్..
రైళ్ల విషయంలో ప్రపంచంలోనే జపాన్ ది గ్రేట్. రైళ్ల నిర్వహణలో దాని దరిదాపుల్లో కూడా ఏ దేశం లేదు. ఇది అతిశయోక్తి కాదు. జపాన్ సాధించిన అద్భుత విజయం. అక్కడ రైళ్లు నిమిషం ఆలస్యం కూడా కావు, కనీసం రైలు ప్రమాదం అంటే కూడా అక్కడి ప్రజలకు తెలియదు. ఇక రైళ్లలో పరిశుభ్రత విషయానికొస్తే అవి సాధారణంగా మన ఇంటికంటే నీట్ గా ఉంటాయి. ఈ లక్షణాలే జపాన్ రైల్వే వ్యవస్థను టాప్ ప్లేస్ లో నిలబెట్టాయి.


టైమ్ అంటే టైమే..
జపాన్ లో రైలు ఆలస్యం అనే సమస్యే ఉండదట. టైమ్ అంటే టైమే. గరిష్టంగా 30 సెకన్ల ఆలస్యం అంటే అదో పెద్ద నేరంగా భావిస్తారు. టైమ్ కి ప్లాట్ ఫామ్ పైకి వస్తుంది. టైమ్ కి బయలుదేరుతుంది, టైమ్ కి గమ్యానికి చేరుస్తుంది. ఇదీ అక్కడి జపాన్ రైల్ నెట్ వర్క్ ప్రత్యేకత. 2017లో 20 సెకన్లు ముందుగానే బయలుదేరినందుకు టోక్యో ప్రాంత రైలు సంస్థ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పడం విశేషం.

పరిశుభ్రత..
రైళ్లలో పరిశుభ్రత విషయానికొస్తే అక్కడి ఉద్యోగులకు నూటికి నూరు మార్కుల కంటే తక్కువ వేయలేం. రైలు ప్లాట్ ఫామ్ పైకి చేరిన కేవలం 8 నిమిషాల్లోనే దాన్ని పూర్తిగా శుభ్రం చేస్తారు. ఎక్కడా ఏ చిన్న మరక కూడా కనిపించదు. ఉద్యోగుల అంకిత భావం వల్లే ఇది సాధ్యమైందంటారు జపాన్ రైల్వే అధికారులు.

సూపర్ నెట్వర్క్..
జపాన్ లో రైలు నెట్వర్క్ కూడా అద్భుతం అనిపిస్తుంది. ఆ దేశంలో ఏ మూల నుంచి ఏ మూలకు వెళ్లాలన్నా రైలు కనెక్టివిటీ ఉంటుంది. విశాలమైన మెగాసిటీల నుండి గ్రామీణ ప్రాంతంలోని పర్వత పట్టణాల వరకు రైలు కనెక్టివిటీ ఉంది. దాదాపు 18,600 మైళ్ల ట్రాక్‌లో 8,500 స్టేషన్‌లను జపాన్ రైల్వే కవర్ చేస్తుంది.

ప్రమాదాలకు తావులేదు..
జపాన్‌కు చెందిన షింకన్‌సెన్ సంస్థ 1964లో ప్రారంభమైంది. దాదాపు ప్రమాదాలేవీ లేకుండా అద్భుతమైన భద్రతా రికార్డును ఆ సంస్థ కలిగి ఉంది. రైలు పట్టాలు తప్పడం లేదా ఒక రైలుని ఇంకో రైలు ఢీకొనడం అనేవి అక్కడ జరగవు. రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అస్సలు లేవు. ఇక రైల్వేలో ఆహారం కూడా అత్యంత హైజినిక్ గా ఉంటుంది. రుచికి, శుచికి జపాన్ రైళ్లలో లభించే ఎకి బెంటో అనే బాక్స్డ్ మీల్ ఉదాహరణ.

ఇదీ క్లుప్తంగా జపాన్ రైళ్ల ప్రత్యేకత. ప్రపంచంలో మరే ఇతర దేశంలోనూ ఈ లక్షణాలుండవు. కనీసం జపాన్ రైల్వే వ్యవస్థ సమీపానికి కూడా ఇతర దేశాల రైల్వేలు రాలేవు. గంటకు 200 మైళ్ల వేగంతో వెళ్లే బుల్లెట్ రైళ్లతో అత్యంత సమర్థమంతమైన వ్యవస్థగా జపాన్ రైల్వే పేరు తెచ్చుకుంది.

Related News

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Special Trains: సికింద్రాబాద్ నుంచి ఆ నగరానికి స్పెషల్ ట్రైన్, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Big Stories

×