ఏపీలో రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా ప్రయాణాలు సాగించే వారు ఈ న్యూస్ అస్సలు మిస్ కావొద్దు. ఎందుకంటే విశాఖ కేంద్రంగా కొన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఆగస్ట్ 26, 28, 30 తేదీల్లో విశాఖ రైళ్లు రద్దయ్యాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను రైల్వే డిపార్ట్ మెంట్ తాజాగా ప్రకటించింది.
కారణం ఏంటి..?
తాడి-దువ్వాడ స్టేషన్ల మధ్య జరుగుతున్న ట్రాక్ రిపేర్ పనుల కారణంగా విశాఖ వెళ్లే రైళ్లను రద్దు చేయాల్సి వచ్చింది. గుంటూరు-విశాఖపట్నం మధ్య ప్రయాణించే ఏడు రైళ్లను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అంటే మొత్తం 21 సర్వీసులు రద్దవుతున్నాయి. గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం మధ్య ప్రయాణాలు చేసే వారికి తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు.
21 సర్వీసులు రద్దు..
గుంటూరు-విశాఖ మధ్య 21 రైలు సర్వీసులు రద్దయ్యాయి. ఆగస్టు 26, 28, 30 తేదీల్లో గుంటూరు-విశాఖపట్నం మధ్య ప్రయాణించే రైళ్లు రద్దవుతున్నాయి కాబట్టి. ఆ మధ్యలో ఉన్న స్టేషన్లకు కూడా రైళ్లు నడవవు.
రాజమండ్రి-విశాఖ మధ్య నడిచే రైలు నెంబర్ 67285
కాకినాడ పోర్టు నుంచి విశాఖపట్నం రైలు నెంబర్ 17267
విశాఖపట్నం నుంచి కాకినాడ పోర్టుకు నడిచే రైలు నెంబర్ 17268
గుంటూరు నుంచి విశాఖపట్నంకు వెళ్లే రైలు నెంబర్ 22876
విశాఖ నుంచి గుంటూరుకు వెళ్లే రైలు నెంబర్ 22875
విజయవాడ నుంచి విశాఖపట్నం ప్రయాణించే రైలు నెంబర్ 12718
విశాఖ నుంచి విజయవాడకు ప్రయాణించే రైలు నెంబర్ 12717 రద్దయ్యాయి.
మూడు రోజులపాటు ఈ సర్వీసులు నిలిపివేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖ వెళ్లే ప్రయాణికులతో పాటు, మధ్యలో ఉన్న స్టేషన్లకు రాకపోకలు సాగించే వారు కూడా దీనికి అనుగుణంగా తమ ప్రయాణాలను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పుల వల్ల ప్రయాణికులకు తాత్కాలికంగా ఇబ్బంది కలిగినా.. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలను అందించే అవకాశముందని అంటున్నారు అధికారులు.
ఇక రైల్వేలో జులై -1 నుంచి చార్జీల సవరణ కూడా అమలులోకి రాబోతోంది. AC కాని మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కిలోమీటరుకు 1 పైసా చొప్పున, AC తరగతులకు కిలోమీటరుకు 2 పైసలు ఛార్జీలను పెంచుతున్నారు. అదనంగా, 500 కి.మీ. దాటిన సుదూర ప్రయాణాలకు రెండవ తరగతి ఛార్జీలు కి.మీ.కు కనీసం 0.5 పైసలు పెరుగుతాయి. కరోనా తర్వాత ఇదే తొలి చార్జీల పెంపు. ఈ పెంపు వల్ల రైల్వేకి సుమారు రూ. 13,000 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా. దీంతోపాటు తత్కాల్ టికెట్ బుకింగ్‌లకు సంబంధించి ఆధార్ ప్రామాణీకరణను జులై-1 నుంచి తప్పనిసరి చేస్తున్నారు.
తత్కాల్ టికెట్ల బుకింగ్ లో అమలులోకి వస్తున్న మార్పుల వల్ల మోసాలను అరికట్ట వచ్చని అంటున్నారు అధికారులు. ఇప్పటి వరకు తత్కాల్ కోటాను అడ్డు పెట్టుకుని ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారని, ఇకపై అలాంటివి ఉండవని, అవసరమైన వారికి టికెట్లు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకే ఈ మార్పులు చేస్తున్నట్టు తెలిపారు.