Secunderabad Railway Station: హైదరాబాద్‌లో ఎప్పుడు చూసినా చాలా రద్దీగా ఉండే ప్రాంతాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒకటి. తెలంగాణలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ ఇండియాలోనే ఫుల్ టైం బిజీగా ఉండే రైల్వే జంక్షన్‌లలో ఒకటిగా పేరుగాంచింది. ఈ స్టేషన్ నుంచి రోజూ లక్షలాది ప్రయాణికులు వచ్చి వెళ్తూ ఉంటారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రవాణా రంగంలో ఒక శక్తివంతమైన కేంద్రంగా నిలుస్తోందని చెప్పుకోవచ్చు. ప్రధాన నగరాలను కలుపుతూ, హైదరాబాద్ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోజువారీ రైలు రాకపోకలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తన వంతు సహాయం చేస్తోంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రోజుకు సుమారు 419 రైలు రాకపోకలు జరుగుతాయని ఇండియా రైల్ ఇన్ఫో చెబుతోంది. ఇందులో 209 రైళ్లు ఇతర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌కు వస్తాయి. సికింద్రాబాద్ నుంచి 210 రైళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్తాయి.
ఈ స్టేషన్ నుంచి 52 రైళ్లు బయలుదేరుతాయట. మరో 54 రైళ్లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చివరి స్టాప్. ఈ స్టేషన్‌లో 105 రైళ్లు ఆగుతాయట. వీటితో కలిపి రోజుకు సగటుగా 229 రైళ్లు ఉండే అవకాశం ఉందని ఇండియా రైల్ ఇన్ఫో తెలిపింది.
రైల్‌యాత్రి లెక్కల ప్రకారం 320 రైళ్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రాకపోకలు జరుపుతాయని తెలుస్తోంది. ఇందులో సీజనల్ లేదా ప్రత్యేక రైళ్లు కూడా ఉండే అవకాశం ఉంది. రోజుకు సుమారు 1,70,000 మంది ప్రయాణికులు ఈ రైల్వే స్టేషన్‌కు వచ్చి వెళ్తారట. అంతమంది ప్రయాణికులకు కూడా సరిపోయేలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మొత్తం 10 ప్లాట్‌ఫాంలు ఉన్నాయి.
ALSO READ: చర్లపల్లి నుంచి విశాఖకు స్పెషల్ ట్రైన్, ఎప్పుడు ఎన్ని గంటలకంటే?
అయితే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.700-720 కోట్ల ఖర్చుతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పునర్‌నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో 60-70 రైళ్లు చెర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి వంటి స్టేషన్‌లకు మళ్లించారు. అయినప్పటికీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైళ్ల రాకపోకాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర మూడు అంతస్తుల కాన్కోర్స్ నిర్మాణం జరుగుతోంది. ఇది 2025-2026 నాటికి పూర్తవనున్నట్లు సమాచారం. ఇవి మాత్రమే కాకుండా అనేక ఆధునిక సౌకర్యాలతో ఈ స్టేషన్ ఎక్కువ రద్దీని కూడా మేనేజ్ చేసేందుకు రెడీగా ఉంది. అంతేకాకుండా ట్రాక్‌లను విస్తరించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.