Tirupati Tirumala Devotees: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. అయితే, వారిలో చాలా మందికి స్వామివారికి సంబంధించి ఏ సేవలు ఎక్కడ లభిస్తాయో తెలియదు. అలాంటి వారి కోసం పూర్తి వివరాలు ఈ స్టోరీలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. తిరుమలకు వచ్చే భక్తులు తరచుగా వచ్చే ప్రశ్నలు, వాటికి సమాధానాలు తెలుసుకుందాం..
స్వామివారి దర్శనం టికెట్లు ఎక్కడ దొరుకుతాయంటే?
సాధారణంగా స్వామివారి దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ బుక్ చేసుకోలేకపోతే తిరుమల లోని పలు ప్రదేశాల్లో టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లు లభిస్తాయి. SSD టికెట్లు విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ లో మరుసటి రోజు దర్శనానికి ప్రతి రోజు సాయంత్రం 4:00 నుంచి కౌంటర్లు ప్రారంభమవుతాయి. SSD టోకెన్లు అంటే.. మీకు ఇచ్చిన టైం ప్రకారం వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకవేళ SSD టోకెన్లు లేనివారు నేరుగా తిరుమల లోని సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. సాధారణ రోజుల్లో 8 నుంచి 10 గంటలు.. రద్దీ ఉన్న రోజుల్లో 16 నుండి 24 వరకు పట్టే అవకాశం ఉంటుంది.
చిన్నపిల్లలకు దర్శనం ఎప్పుడు కల్పిస్తారు?
ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.. సుపథం ద్వారా చిన్న పిల్లలు ప్రత్యేక దర్శనానికి వెళ్ళవచ్చు. ఎలాంటి టికెట్లు అవసరం లేదు. చిన్నపిల్లలు ఒక సంవత్సరం లోపు వయసు కలిగి ఉండాలి. చిన్నపిల్లల ఆధార్ కార్డు లేదంటే బర్త్ సర్టిఫికేట్ కచ్చితంగా ఉండాలి. పిల్లల తల్లిదండ్రులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. విశేష పర్వదినాల్లో దర్శనాలు రద్దు చేస్తారు. వయోవృద్ధులకు, దివ్యాంగులకు కొండపైన ప్రత్యేక దర్శనం అంటూ ఏమీ ఉండదు. 3 నెలల ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలి. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు కూడా 3 నెలల ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక బ్రేక్ దర్శనం లెటర్ పై ఆరుగురు భక్తులు శ్రీవారి దర్శనాన్ని చేసుకునే అవకాశం ఉంటుంది. తిరుమలలో 12 సంవత్సరాలు లోపు వారికి ఎటువంటి టికెట్ అవసరం లేదు… 12 సంవత్సరాల దాటితే కచ్చితంగా దర్శనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
తిరుమలలో రూమ్స్ కావాలంటే ఎలా?
తిరుమలలో ముందుగా రూమ్ బుక్ చేసుకోకపోయినా, కొండపై బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. CRO ఆఫీస్ వద్ద క్యూలైన్లోకి వెళితే గదులు ఖాళీలు బట్టి కేటాయిస్తారు. ఒకవేళ గదులు అందుబాటులో లేకపోతే యాత్రిసదన్ లో లాకర్స్ తీసుకుని విశ్రాంతి తీసుకోవచ్చు. ముందుగా ఆన్ లైన్ లో టికెట్లు , రూములు బుక్ చేసుకుని కొండపైకి వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం అవుతుంది. దర్శనం టికెట్లు, రూముల కోసం ఎవరన్నీ సంప్రదించి డబ్బులు పోగొట్టుకోకూడదని టీటీడీ అధికారులు భక్తులకు సూచించారు.
శ్రీవారి వాలంటరీ సేవా చేయాలంటే ఎలా?
తిరుమలలో శ్రీవారి వాలంటరీ సేవ చేయాలంటే ముందుగా 15 మంది గ్రూపుగా ఏర్పడాలి. ఆ తర్వాత ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. వారికి టీటీడీ అధికారులు సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తారు.
Read Also: చంద్రబాబుకు నచ్చిన ప్లేస్ ఏది? దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?