New Vande Bharat Train: వందేభారత్ ఎక్స్ ప్రెస్ సేవలు రోజు రోజుకు విస్తరిస్తున్నాయి. త్వరలో ఏపీ నుంచి మరో సెమీ హైస్పీడ్ రైలు పరుగులు తీయబోతోంది. ఈ రైలు విజయవాడ నుంచి తన ప్రయాణాన్ని మొదలు పెట్టనుంది. తిరుపతికి వెళ్లాలి అనుకునే భక్తులకు ఎంతగానో ఉపయోగపడనుంది. జస్ట్ నాలుగు గంటల్లోనే భక్తులు శ్రీవారి చెంతకు చేరుకునే అవకాశం ఉంది. ఇంతకీ కొత్తగా ప్రారంభం కానున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఏయే నగరాల మధ్య నడుస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
విజయవాడ- బెంగళూరు రూట్ లో కొత్త వందేభారత్
విజయవాడ-బెంగళూరు నడుమ వందేభారత్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. త్వరలో ఈ రైలును ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ రైలు ప్రారంభం అయితే, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుత రైలు ప్రయాణం 12 గంటలు కొనసాగుతుండగా, వందేభారత్ రైలు కేవలం 9 గంటల్లో గమ్యస్థానానికి చేరుకోనుంది. విజయవాడ నుంచి తిరుపతి, బెంగళూరుకు వెళ్లే ప్రయాణీకులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ రైలులో మొత్తం 8 కోచ్ లు ఉండనున్నాయి. వాటిలో 7 ఏసీ చైర్ కార్లు కాగా, ఒక ఎగ్జిక్యుటివ్ చైర్ కార్ ఉంటుంది.
మంగళవారం మినహా మిగతా అన్ని రోజుల్లో సేవలు
విజయవాడ-బెంగళూరు వందేభారత్ రైలు వారంలో 6 రోజుల పాటు సర్వీసులు అందించనుంది. కేవలం మంగళవారం నాడు ఈ రైలు అందుబాటులో ఉండదు. ఈ రైలు(20711) ఉదయం 5.15 గంటలకు విజయవాడలో బయల్దేరి మధ్యాహ్నం 1.45 నిమిషాలకు బెంగళూరుకు చేరుకుంటుంది. ఇదే రైలు((20712) తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.15 గంటలకు బెంగళూరు నుంచి బయల్దేరుతుంది. రాత్రి 11.45 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. ఈ రైలు కేవలం నాలుగున్నర గంటల్లో విజయవాడ నుంచి తిరుపతికి చేరుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం వారానికి 3 రోజులు.. ఇకపై ప్రతి రోజూ..
ప్రభుత్వం విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే మచిలీపట్నం- యశ్వంత్ పూర్ వెళ్లే కొండవీడు ఎక్స్ ప్రెస్ ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ రైలు వారానికి కేవలం మూడు రోజులే అందుబాటులో ఉంటుంది. ఇక త్వరలో అందుబాటులోకి రానున్న విజయవాడ-బెంగళూరు వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రతి రోజు అందుబాటులో ఉంటుంది. విజయవాడ నుంచి రోజూ ప్రయాణించే అవకాశం ఉంటుంది.
3 ఏళ్లలో 200 వందేభారత్ రైళ్లు!
దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లను పెద్ద సంఖ్యలో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తయారీ సంస్థలకు ఆర్డర్లు ఇచ్చింది. వీటిలో చైర్ కార్ రైళ్లతో పాటు స్లీపర్ రైళ్లు కూడా ఉంటాయి. త్వరలోనే దేశ వ్యాప్తంగా 10 మార్గాల్లో వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే ఆయా రూట్లను రైల్వే బోర్డు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు మూడు వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ రైలు ఇదే, ఏ రూట్ లో నడుస్తుందంటే?