పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాలోని ఆదివాసీ కుర్మి సమాజ్ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇండియన్ రైల్వే అలర్ట్ అయ్యింది. ఈ రాష్ట్రాల్లో రాకపోకలు కొనసాగించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన జారీ చేసింది.
ఆదివాసీ కుర్మి సమాజ్ కులస్తులు తమను ఎస్టీల్లో కలపాలని మూడు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో రైల్ రోకోలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎక్స్ ప్రెస్, వందే భారత్ తో సహా అనేక రైళ్లు ప్రభావితమయ్యాయి. ఈ ఆందోళనలపై హైకోర్టు నిషేధం విధించిన నేపథ్యంలో బెంగాల్ లో ఎటువంటి రైలు దిగ్బంధనాలు లేనప్పటికీ, జార్ఖండ్ లో నిరసనలు రైళ్లపై ప్రభావం చూపాయి. పురులియాలోని కోట్శిలా స్టేషన్ లో నిరసనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. పశ్చిమ మెదినీపూర్, ఝర్ గ్రామ్, బంకురాలో పోలీసులు భారీగా మోహరించారు. బెంగాల్ లో ఆందోళనలు లేనప్పటికీ, పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆందోళన నేపథ్యంలో రాంచీ-వారణాసి వందే భారత్ ఎక్స్ ప్రెస్, టాటానగర్-పాట్నా వందే భారత్ ఎక్స్ ప్రెస్, అహ్మదాబాద్-హౌరా ఎక్స్ ప్రెస్, ముంబై-షాలిమార్ ఎక్స్ ప్రెస్, జమ్మూ తావి-సంబల్ పూర్ ఎక్స్ ప్రెస్, ఎర్నాకుళం-టాటానగర్ ఎక్స్ ప్రెస్‌తో సహా 21 రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. హతియా-ఖరగ్ పూర్ ఎక్స్ ప్రెస్, హతియా-అసన్సోల్ ఎక్స్ ప్రెస్, రాంచీ-పాట్నా వందే భారత్ ఎక్స్ ప్రెస్, రాంచీ-దుమ్కా ఎక్స్ ప్రెస్ లతో సహా పన్నెండు రైళ్లను రద్దు అయ్యాయి. రెండు రైళ్లను దారి మళ్లించారు. ఐదు రైళ్లను స్వల్పకాలికంగా నిలిపివేశారు. “ఆదివాసీ కుర్మి సమాజ్ చేపట్టిన ఆందోళన కారణంగా సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ సేవలు పాక్షికంగా ప్రభావితమయ్యాయి. ఖరగ్ పూర్ డివిజన్ లోని భంజ్ పూర్ స్టేషన్ లో ఉదయం 05:02 గంటల నుండి సాయంత్రం 05:35 గంటల వరకు ఆందోళన జరిగింది” అని సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ (SER) వెల్లడించింది.
SER ప్రకారం మొత్తం 43 రైళ్లు రద్దు అయ్యాయి. ఇవాళ మరో 12 రైళ్లను రద్దు చేశారు. 20 రైళ్లను దారి మళ్లించగా, 24 రైళ్లను స్వల్పంగా రద్దు చేయాల్సి వచ్చింది. ఎనిమిది రైళ్లను నిలిపివేశారు. “కుర్మీలు రైలు, రోడ్డు మార్గాలను దిగ్భందించకూడదని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. నిరసనల్లో పాల్గొనకూడదని కుర్మి నాయకులకు చెప్పాం. శాంతిని కాపాడాలని కోరాం” అని ఝర్గామ్ ఎస్పీ అరిజిత్ సిన్హా వెల్లడించారు.
కుర్మి కులాన్ని ఎస్టీలో చేర్చాలని ఆ కులస్తులు ఆందోళన చేపడుతున్నారు. 1931 జనాభా లెక్కల ప్రకారం కుర్మిలను STలుగా వర్గీకరించిన వర్గాలలో చేర్చారు. 1950లో ST జాబితా నుంచి ఈ కులాన్ని మినహాయించారు. 2004లో, జార్ఖండ్ ప్రభుత్వం ఈ కులాలను OBCలుగా వర్గీకరించడానికి బదులుగా ST జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసింది. తమను ఎస్టీ కులంలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కుర్మి కులస్తులు ఆందోళనలు చేపడుతున్నారు.
Read Also: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?