Indian Railway Rules: భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వ్యవస్థ. రోజూ మూడు కోట్ల మంది ప్రజలు రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎప్పటికప్పుడు రైల్వే సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇబ్బందుల్లో ఉన్న ప్రయాణీకులకు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది. ఎందుకంటే రైళ్లలో ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయాణం చేస్తుంటారు. సుదూర ప్రాంతాలకు తక్కువ ధరలో, సౌకర్యవంతంగా వెళ్లే అవకాశం ఉండటంతో చాలా మంది ట్రైన్ జర్నీని ఇష్టపడుతారు. అందుకే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే రైల్వే సంస్థ కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నది. ముఖ్యంగా ఫుడ్ ఐటెమ్స్ విషయంలో కచ్చితంగా ఎమ్మార్పీ పాటించాలని సూచించింది. రైలుతో పాటు రైల్వే స్టేషన్ లోనూ ఎమ్మార్పీ ధరలను మించి అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
వాటర్ బాటిళ్లను ఎక్కువ ధరకు అమ్మితే ఏం చేయాలి?
రైల్లో అమ్మే తినుబండారాలు సహా వాటర్ బాటిల్స్ కూడా కచ్చితంగా ఎమ్మార్పీ ధరకే అమ్మాలని భారతీయ రైల్వే సంస్థ నిర్ణయించింది. తరచుగా మనం రైలు ప్రయాణం చేసే సమయంలో చాలా మంది రూ. 15 ఉన్న వాటర్ బాటిళ్లను రూ. 20కి అమ్ముతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ ధరకు అమ్మకూడదంటున్నది రైల్వే సంస్థ. ఒకవేళ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మితే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నది.
కంప్లైంట్ ఎలా చేయాలంటే?
రైల్లో వస్తువులను ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మితే వెంటనే రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 139 కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఈ నంబర్‌కు కాల్ చేసిన తర్వాత, ఫిర్యాదు కోసం మిమ్మల్ని PNR నంబర్‌ని అడుగుతారు. చెప్పిన తర్వాత మీ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. ఇలా కాకుండా, రైల్వే టోల్ ఫ్రీ నంబర్ 1800111139కి కాల్ చేసి కూడా కంప్లైట్ చేసే అవకాశం ఉంది. మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నది భారతీయ రైల్వే సంస్థ. ఏ రైల్లో ప్రయాణిస్తున్నా, ఎమ్మార్పీకి మించి వస్తువులను అమ్మితే 9717630982కు మెసేజ్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.
వెబ్ సైట్ లోనూ ఫిర్యాదు చేసే అవకాశం
అటు ‘రైల్ మదత్’ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ముందుగా https://railmadad.indianrailways.gov.in/madad/final/home.jsp ఓపెన్ చేయాలి. ఇక్కడ ఫిర్యాదును నమోదు చేసిన తర్వాత, మీకు ఫిర్యాదు నంబర్ వస్తుంది. ఈ నెంబర్ ద్వారా మీ కంప్లైట్ స్టేటస్ ను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఎమ్మార్పీకి మించి అమ్మడం నేరం
రైల్వే స్టేషన్ తో పాటు రైళ్లలోనూ ఏ వస్తువు అయినా నిర్ణయించిన ధరకే అమ్మాలని వ్యాపారులకు రైల్వే సంస్థ తేల్చి చెప్పింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రయాణీకులకు అసౌకర్యం కలిగించే ప్రయత్నం చేయకూడదని వెల్లడించింది.
Read Also: అయ్యప్ప దర్శనానికి ఆన్ లైన్ లో టికెట్ల బుకింగ్.. ఎలా చేసుకోవాలో తెలుసా?