Sabarimala Online Booking: ప్రతి ఏటా అయ్యప్ప దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ప్రతి సంవత్సరం భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నది. అయ్యప్పను దర్శించుకునేందుకు రోజూ 80 వేల మంది భక్తులను అనుమతించనున్నట్లు తెలిపింది. శబరిమల యాత్రికుల కోసం ట్రావెన్ కోర్ దేవస్వామ్ బోర్డు వర్చువల్ క్యూ టికెట్ బుకింగ్స్ ను ఓపెన్ చేసింది. ప్రతి రోజు 70,000 టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నది. మిగిలిన 10,000 మంది శరబరిమలలోనే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు అయ్యప్ప స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
భక్తుల రద్దీ నేపథ్యంలో కీలక నిర్ణయం
గత ఏడాది మండల పూజల సమయంలో శరిమలకు భక్తులు పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంత మంది తరలివచ్చారు. భక్తుల రద్దీని అదుపు చేయడంలో ఆలయ అధికారులు విఫలం అయ్యారు. భక్తులకు కనీస వసతులు కల్పించలేకపోయారు. స్వామి వారి దర్శనానికి వచ్చిన వాళ్లంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా మంది అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుదిరిగారు. దేవస్థానం బోర్డుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అధికారులు ఆన్ లైన్ టికెట్ బుకింగ్ కు శ్రీకారం చుట్టారు.
దర్శన వేళల పొడిగించిన అధికారులు
మకర సంక్రాంతి సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీని అదుపు చేసేందుకు ఆలయ దర్శన వేళలను పొడిగించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులు ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. రోజుకు మొత్తం 17 గంటల పాటు స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నారు.
శబరిమల ఆన్ లైన్ టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
⦿ ముందుగా https://sabarimala.kerala.gov.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
⦿ మీ ఫోన్ నంబర్, ఈ మెయిల్ తో లాగిన్ కావాలి.
⦿ ఐడీనికి క్రియేట్ చేసుకోవాలి. కన్ఫర్మేషన్ కోసం ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి పేరు, అడ్రస్ తో పాటు ఆధార్ లేదంటే ఓటర్ ఐడీ ద్వారా ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు.
⦿ ఆ తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ కు OTP వస్తుంది. OTPని ఎంటర్ చేయాలి.
⦿ శబరిమల దర్శనం టికెట్‌ను బుక్ చేసుకోవడానికి వర్చువల్ క్యూపై క్లిక్ చేయాలి.
⦿ శబరిమల ఆలయ సందర్శన కోసం డేట్, రూట్, టైమ్ స్లాట్ ను ఎంచుకోవాలి.
⦿ శబరిమల వర్చువల్ క్యూ టికెట్ బుకింగ్ కన్ఫర్మ్ చేయడానికి సబ్మిట్ బటన్ నొక్కాలి. మీ టికెట్ బుక్ అవుతుంది.
⦿ 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వర్చువల్-క్యూ టిక్కెట్లు అవసరం లేదని అధికారులు తెలిపారు.
Read Also: తక్కువ ధరకే 6 పుణ్యక్షేత్రాల సందర్శన, IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ!