Indian Railway SuperApp: భారతీయ రైల్వే సంస్థ అన్ని రైల్వే సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తూ సరికొత్త యాప్ ను పరిచయం చేసింది. ‘స్వరైల్’ సూపర్ యాప్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా టికెట్ బుకింగ్ నుంచి లైవ్ లోకేషన్ వరకు అన్ని విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది. గతంతో పోల్చితే మరింత సులభంగా, వేగంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు అంటున్నారు రైల్వే అధికారులు. ప్రస్తుతం టికెట్ బుకింగ్ విధానాన్నే ఇందులోనూ పొందుపరిచినప్పటికీ, ప్రతిసారి టికెట్ బుకింగ్ సమయంలో వినియోగదారు వివరాలు ప్రత్యేకంగా అందించాల్సిన అవసరం లేదు. ప్రయాణ వివరాలను అందితే సరిపోతుంది.
ఒక్కో రైల్వే సేవకు.. ఒక్కో యాప్..
సూపర్ యాప్ కు ముందుకు వరకు రైల్వేకు సంబంధించిన పలు సర్వీసుల కోసం రకరకాల యాప్స్ ఉపయోగించాల్సి వచ్చేది. రిజర్వేషన్ టికెట్ల బుకింగ్ కోసం IRCTC రైల్ కనెక్ట్, రిజర్వేషన్ లేని టికెట్ల కోసం UTS యాప్, ఫుడ్ ఆర్డర్ కోసం IRCTC కేటరింగ్ ఫుడ్ ఆన్ ట్రాక్, కంప్లైట్స్ కోసం రైల్ మదత్ లాంటి పలు యాప్స్ ఉపయోగించాల్సి వచ్చేది. ఇక రైల్వే ట్రాకింగ్, కరెంట్ ట్రైన్ స్టేటస్ కోసం నేషనల్ ట్రైన్ ఎంక్వయిరీ సిస్టమ్ యాప్ ను చూడాల్సి ఉండేది. ఒక్కో సేవకు ఒక్కో యాప్ ఉపయోగించాలంటే ప్రయాణీకులకు విరక్తి కలిగేది. ఈ నేపథ్యంలోనే అన్ని సేవలను ఒకే చోట అందించేందుకు గాను సూపర్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
సూపర్ యాప్ లో బోలెడు సర్వీసులు
అత్యాధునిక సూపర్ యాప్ ను ఉపయోగించి రిజర్వేషన్ టికెట్ తో పాటు రిజర్వేషన్ లేని టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్లాట్ ఫామ్ టికెట్లు కూడా పొందవచ్చు. టికెట్లను క్యాన్సిల్ చేసుకోవచ్చు. ప్రయాణ సమయంలో ఫుడ్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. పార్శిల్స్, డెలివరీలను ట్రాక్ చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే రైల్వేకు సంబంధించిన అన్ని సేవలను ఈ యాప్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది.
టెస్టింగ్ దశలో సూపర్ యాప్
ప్రస్తుతం ఈ యాప్ టెస్టింగ్ దశలో ఉంది. పరిమిత సంఖ్యలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. యాప్ స్టోర్ లేదంటే ప్లే స్టోర్ ద్వారా ‘స్వరైల్’ అని సెర్చ్ చేస్తే ఈ యాప్ కనిపిస్తుంది. ఈ యాప్ ఇంటర్ ఫేజ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ముందు మీ వివరాలతో లాగిన్ కావాలి. ఆ తర్వాత పాస్ వర్డ్ లేకుండా నేరుగా లాగిన్ కావచ్చు. రాబోయే రోజుల్లో బీటా టెస్టర్ల సంఖ్య పెంచే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మరింత మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. టెస్టింగ్ దశ పూర్తి కాగానే, ఈ యాప్ ను పూర్తి స్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని సేవలను మరింత సులభంగా పొందే అవకాశం ఉంటుంది.
Read Also: RAC టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? అయితే.. ఈ విషయాలు కచ్చితంగా తెలియాల్సిందే