పండుగ సీజన్ వస్తున్న నేపథ్యంలో భారతీయ రైల్వే మరో ముఖ్యమైన ప్రకటన చేసింది. రైల్వే టికెట్ల బుకింగ్ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఉండటంతో పాటు టికెటింగ్ మోసాలకు అవకాశం లేకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి జనరల్ రిజర్వేషన్ టికెట్ల బుకింగ్ కూ ఆధార్ ను తప్పనిసరి చేసింది. అయితే, ఈ ప్రక్రియ మొత్తానికి కాకుండా టికెట్లు అందుబాటులోకి వచ్చిన 15 నిమిషాల వరకు మాత్రమే వర్తించేలా నిర్ణయించింది. ఈ నిబంధన IRCTC వెబ్ సైట్, మొబైల్ యాప్ రెండింటిలోనూ వర్తిస్తుందని రైల్వేశాఖ వెల్లడించింది.
ఇప్పటి వరకు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే IRCTC అకౌంట్ కు ఆధార్ తప్పనిసరి చేస్తూ గత కొద్ది నెలల క్రితమే భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ విధానాన్ని జనరల్ టికెట్ల రిజర్వేషన్ కూ విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. తాజా నిబంధనల ప్రకారం.. ఓ ప్యాసింజర్ తన ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ సదరు ప్రయాణీకుడు నవంబర్ 15న ప్రయాణించాలనుకుంటే, రైల్వే నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 16 అర్ధరాత్రి 12:20 గంటలకు బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. తాజా రూల్ ప్రకారం 12:20 నుంచి 12:35 గంటల మధ్య 15 నిమిషాల పాటు కేవలం ఆధార్ తో తమ అకౌంట్ ను ధృవీకరించిన వారికి మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ లింక్ లేనివారు టికెట్లు బుక్ చేసుకోవడానికి అనుమతి ఉండదు. ఈ సమయంలో టికెట్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి, ఈ నిర్ణయం తీసుకుంది భారతీయ రైల్వే. ప్రస్తుతం జూలై 2025 నుంచి తత్కాల్ బుకింగ్ కు ఆధార్ లింక్ నిబంధన అమలు అవుతుండగా, ఇప్పుడు జనరల్ కోటాకు అమలు చేయబోతున్నారు.
ఇక వరుసగా దసరా, దీపావళి, ఛత్ పూజ లాంటి పండుగలు వస్తున్న నేపథ్యంలో రైల్వే టికెట్లకు భారీగా పోటీ ఉంటుంది. బుకింగ్స్ ప్రారంభం అయిన కొద్ది క్షణాల్లో టికెట్లు బుక్ అయిపోతాయి. ఈ డిమాండ్ ను కొంత మంది ఏజెంట్లు, ఇతర వ్యక్తులు టికెట్లను బ్లాక్ చేస్తున్నట్లు రైల్వే గుర్తించింది. ఇక ఆధార్ అథెంటిఫికేషన్ రూల్ తీసుకురావడంతో ఈ అక్రమాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉన్నట్లు భావిస్తోంది. ఈ నిర్ణయం కారణంగా నిజమైన ప్రయాణీకులకు టికెట్లు పొందే అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా టికెట్లు బుక్ చేసుకోవాలంటే అక్టోబర్ 1 వరకు తమ IRCTC ఐడీకి ఆధార్ నెంబర్ ను లింక్ చేసుకోవాలని భారతీయ రైల్వే సూచించింది.
Read Also: రూ. 4 వేల కోట్లతో కేదార్‌నాథ్ లో కళ్లు చెదిరే రోప్‌వే.. ఇది ప్రపంచంలోనే వెరీ వెరీ స్పెషల్!