ఆంధ్రప్రదేశ్ లోని ఎర్ర మట్టి దిబ్బలు (ఎర్ర ఇసుక దిబ్బలు), తిరుమల కొండలు అరుదైన గుర్తింపు దక్కించుకున్నాయి. యునెస్సో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేరాయి. ఏ ప్రాంతం అయినా వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందాలంటే ముందుగా తాత్కాలిక జాబితాలోకి చేరాల్సి ఉంటుంది. ఈ సహజ వారసత్వ ప్రదేశాలను రక్షించడానికి, సంరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్దేశాన్ని ప్రకటించిన తర్వాత అసలైన జాబితాలో స్థానం పొందే అవకాశం ఉంటుంది.
ఎర్రమట్టి దిబ్బలను ఎర్ర ఇసుక దిబ్బలు అని కూడా పిలుస్తారు. ఇవి విశాఖపట్నం సమీపంలోని తీరం వెంబడి 1,500 ఎకరాలలో విస్తరించి ఉన్నాయి. ఈ నిర్మాణాలు ఇసుక, సిల్ట్, బంకమట్టితో కూడి ఉన్నాయి. వేల సంవత్సరాలలో సహజ ఆక్సీకరణ ఫలితంగా వాటి ప్రత్యేకమైన ఎర్రటి రంగు ఏర్పడింది. ఈ ప్రదేశంలో డెన్డ్రిటిక్ డ్రైనేజీ నమూనాలు, అవక్షేప పొరలు ఉన్నాయి. ఇవి క్వాటర్నరీ కాలం చివరిలో సముద్ర మట్టంలో హెచ్చుతగ్గులు, వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడినట్లు పరిశోధకులు గుర్తించారు. 1886లో బ్రిటిష్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త విలియం కింగ్ మొదటిసారిగా డాక్యుమెంట్ చేసిన ఈ నిర్మాణాలు అరుదైన తీర భూరూప శాస్త్ర లక్షణాలుగా పరిగణించబడతాయి.
ప్రపంచంలో ఇలాంటివి మరో రెండు ప్రదేశాల్లో మాత్రమే ఉన్నాయి. ఒకటి తమిళనాడులో, మరొకటి శ్రీలంక. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) 2016లో ఎర్ర మట్టి దిబ్బలును జాతీయ భౌగోళిక వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించింది. అయితే, ఈ ప్రదేశం పర్యాటకం, సినిమా చిత్రీకరణ కార్యకలాపాల నుంచి ముప్పులను ఎదుర్కొంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిరక్షణ చర్యల అవసరమని వెల్లడించారు.
తిరుపతి జిల్లాలోని తిరుమల కొండలు భౌగోళిక, పర్యావరణ, సాంస్కృతిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ ప్రాంతంలో ఎపార్కియన్ అన్‌కన్ఫార్మిటీ ఉంది. ఇక్కడ 2.5 బిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల రాళ్ళు ఉన్నాయి. ఈ ప్రాంతంలో తిరుమల ఆలయానికి సమీపంలో ఉన్న అరుదైన శిల అయిన సహజ తోరణం లేదంటే సిలాథోరం కూడా ఉంది. ఇది 1.5 బిలియన్ సంవత్సరాల పురాతనమైనదని భావిస్తున్నారు.
ఈ కొండలు శేషాచలం బయోస్పియర్ రిజర్వ్, వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనంలో భాగంగా ఉన్నాయి. ఇవి అంతరించిపోతున్న రెడ్ సాండర్స్, సైకాస్ బెడ్డోమీ, జెర్డాన్స్ కోర్సర్ వంటి విభిన్న వృక్షజాలం, జంతుజాలానికి నిలయంగా ఉన్నాయి. కాలానుగుణ జలపాతాలు, దట్టమైన అడవులు, అద్భుతమైన జీవవైవిధ్యంతో, ఈ ప్రదేశం సహజ సౌందర్యం, భౌగోళిక ప్రాముఖ్యత, పర్యావరణ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందేందుకు రెడీ అయ్యాయి.
యునెస్కో ప్రకారం ఎర్ర మట్టి దిబ్బలు సైట్ థీమ్ 2: టెక్టోనిక్ వ్యవస్థ, థీమ్ 7: జియోలాజికల్ వరల్డ్ హెరిటేజ్ (IUCN, 2021)లో భాగంగా అర్హత పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు తిరుమల సైట్ థీమ్ 1: భూగ్రహం చరిత్ర, జీవిత పరిణామం కింద అర్హత పొందవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Read Also: ఇది ఇండియాలోనే భయానక ప్రాంతం.. అయినా సరే బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ ఎలా నిర్మించారంటే?