రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రివేళలో విజిబిలిటీ కోసం ఇకపై వాహనాలకు రిప్లెక్టివ్ టేప్స్, రియర్ మార్కింగ్ ప్లేట్స్ తప్పనిసరి చేసింది. ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ కొత్త మార్గదర్శకాలకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది. ద్విచక్ర వాహనాలు, గూడ్స్ క్యారియర్లు, ఆటో రిక్షాలు, బస్సులు, ట్రాక్టర్లు, ట్రైలర్లు, మాడ్యులర్ హైడ్రాలిక్ ట్రైలర్లు, పవర్ టిల్లర్లు, హార్వెస్టర్లు లాంటి వాహనాలు ఇకపై ధృవీకరించబడిన రిఫ్లెక్టివ్ పరికరాలను ఇన్ స్టాల్ చేయించుకోవాల్సి ఉంటుంది. రోడ్ సేప్టీపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. రాత్రి సమయాల్లో కొందరు వాహనాలను రోడ్లపై ఆపడం, నెమ్మదిగా వెళ్లడం చేస్తున్నారు. వాటిని గమనించక వెనుక వచ్చే వాహనదారులకు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యను నివారించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
వాహనాలకు ఉపయోగించే రిఫ్లెక్ట్ టేపులు ఒరిజినల్ వి మాత్రమే ఉపయోగిచాలని రవాణాశాఖ తన ఉత్తర్వులలో వెల్లడించింది. AIS 057, 090, 089 లాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన టేపులు వాహనాలకు అతికించాలని స్పష్టం చేసింది. లో క్వాలిటీ, ఫేక్ రిఫ్లెక్టివ్ టేపులు వాడితే గూడ్స్ వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ జారీ, రిజిస్ట్రేషన్ రెన్యువల్ ప్రక్రియను నిలిపివేస్తామని తేల్చి చెప్పింది. నకిలీ టేపులు తయారు చేసేవారిపై, అమ్మేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. కొత్త వాహనాలకు తయారీ కంపెనీలే టేపులు అమర్చాలని వెల్లడించింది. ఈ టేపుల తయారీదారులు చెల్లుబాటు అయ్యే టెస్ట్ సర్టిఫికేట్ మరియు కన్ఫర్మిటీ ఆఫ్ ప్రొడక్షన్ (COP) సర్టిఫికేట్ ను కలిగి ఉండాలన్నది. CMVR రూల్ 126 కింద పరీక్షా సంస్థలు ఆమోదించిన ఎంప్యానెల్డ్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (OEMలు) మాత్రమే రిఫ్లెక్టింగ్ ఉత్పత్తులను సరఫరా చేయడానికి అధికారం కలిగి ఉంటారని వెల్లడించింది.
Read Also: కారును తప్పించబోయిన రోడ్డు దాటి దూసుకెళ్లిన బస్సు, తృటిలో తప్పిన పెను ముప్పు!
అటు సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ వెల్లడించింది. రహదారి భద్రత ఆదేశాల ప్రకారం అమల్లోకి తీసుకొచ్చిన ఈ రూల్.. తరచుగా తక్కువ వాహన దృశ్యమానత కారణంగా సంభవించే రాత్రిపూట ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. రవాణా, రోడ్లు, భవనాల శాఖ, G.O.Ms.No.60 ద్వారా, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (CMVR), 1989లోని నియమం 104ను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. కొత్త నిబంధనలు రాత్రిపూట వాహనాల విజుబులిటీని గణనీయంగా పెంచుతాయని రవాణా అధికారులు భావిస్తున్నారు. అదే సమయంలో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ఇది ఇండియాలోనే భయానక ప్రాంతం.. అయినా సరే బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ ఎలా నిర్మించారంటే?