పంచ వ్యాప్తంగా ప్రయాణాల కోసం ఎక్కువ మంది ఉపయోగించే రవాణ వ్యవస్థ రైల్వే వ్యవస్థ. నిత్యం కోట్లాది మంది ప్రయాణీకులు రైళ్ల ద్వారా తమ రాకపోకలు కొనసాగిస్తారు. తక్కువ ఖర్చుతో ఆహ్లాదకర ప్రయాణ అనుభవాన్ని పొందుతారు. అయితే, ప్రపంచంలో ఎన్నో రైల్వే వింతలు ఉన్నాయి. అలాంటి వింతల్లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రపంచ రైల్వే ప్రయాణీకులకు విస్మయానికి గురి చేసే రైల్వే క్వింఘై-టిబెట్ రైల్వే. టిబెట్ పీఠభూమి మధ్య భాగం నుంచి వెళ్లే ఈ రైల్వే మార్గం మానవ నిర్మిత ఇంజినీరింగ్ అద్భుతం. ఈ మార్గంలో ఉన్న టాంగుల రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే వింతైన, అద్భుతమైన స్టేషన్. టిబెట్ అటానమస్ రీజియన్ లోని టాంగుల పర్వతాలలో ఉన్న ఈ స్టేషన్ సముద్ర మట్టానికి ఏకంగా 5,068 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ స్టేషన్ లో ప్రశాతం సమయంలో సన్నని గాలులు వీస్తాయి. కొన్నిసార్లు కఠినమైన గాలులు వీస్తాయి. ఈ స్టేషన్ చుట్టూ ఉన్న విశాలమైన ప్రకృతి దృశ్యాలు, నిశ్శబ్దంగా, అద్భుతంగా ఉంటాయి. ఇక్కడి నుంచి రోజూ పలు రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి.
ఈ స్టేషన్ క్వింఘై-టిబెట్ రైల్వేలో భాగంగా కొనసాగుతుంది. ఇది క్వింఘై ప్రావిన్స్ రాజధాని జినింగ్ ను టిబెట్ రాజధాని నగరం లాసాను కనెక్ట్ చేస్తుంది. దాదాపు 2,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రైల్వే లైన్ 2006లో అధికారికంగా ప్రారంభించబడింది. ఇప్పటి వరకు పూర్తయిన అత్యంత సవాలుతో కూడిన రైల్వే ప్రాజెక్టులలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంజనీర్లు దీని నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. అస్థిరమైన ముంచు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు, ఎత్తులో తక్కువ స్థాయి ఆక్సిజన్ వరకు ఎన్నో సవాళ్లను ఫేస్ చేశారు.
టాంగుల రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే ఎత్తైన స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకున్నా, ఇక్కడ రైళ్లు ఆగవు. అయినా ఇక్కడ మూడు ట్రాక్‌లు ఉన్నాయి. ఇందులో ఒకటి పూర్తి ప్లాట్ ఫారమ్ కాగా, మరొకటి చిన్న స్టబ్ ప్లాట్ ఫారమ్ ఉంది. ఈ ప్లాట్ ఫారమ్ పొడవు 1.25 కిలోమీటర్లు, మొత్తం విస్తీర్ణం 77,002 చదరపు మీటర్లు. ఈ ప్రాంతం ప్రజలు ఉండరు. అందుకే, ఈ రైల్వే స్టేషన్ లో సిబ్బంది ఉండరు. ఇక్కడ ఎవరూ రైళ్లు ఎక్కరు కూడా. కానీ, ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించేందుకు రైళ్లు నెమ్మదిగా వెళ్తాయి. దూరంలో మంచుతో కప్పబడిన శిఖరాలు మేఘాల మీదుగా పైకి లేచి కనిపిస్తాయి. గడ్డి భూములు కనువిందు చేస్తాయి. ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఇది భూమ్మీద రైలు వెళ్లే అత్యంత ఎత్తైన ప్రదేశం కావడం విశేషం. ఈ ప్రదేశం గుండా రైళ్లు వెళ్లే సమయంలో ప్రయాణీకులు సులభంగా ఊపిరి పీల్చుకునేలా ఆక్సీజన్ సరఫరా వ్యవస్థలు అమర్చబడి ఉంటాయి. ఇది క్వింఘై-టిబెట్ రైల్వే లైన్ లో ప్రధానంగా టెక్నికల్ పాయింట్ గా ఉపయోగపడుతుంది.
Read Also: హైదరాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్‌లో కీలక ముందడుగు.. ఆ పనులు మొదలయ్యాయ్!