ఈ రోజుల్లో యువతకు స్మార్ట్ ఫోన్ వ్యసనంగా మారింది. చీటికి మాటికి సెల్ఫీలు తీసుకోవడం, సోషల్ మీడియాలో షేర్ చేయడం కామన్ అయ్యింది. సెల్ఫీల పిచ్చి కారణంగా చాలా మంది యువతీ, యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైల్వే ట్రాక్‌ల దగ్గర సెల్ఫీలు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) కీలక ప్రకటన విడుదల చేసింది.
ట్రాక్ ల మీద సెల్ఫీలు తీసుకుంటే జైలు శిక్ష!
రైల్వే స్టేషన్లలో, ట్రాక్ లపై సెల్ఫీలు తీసుకోవడం, సోషల్ మీడియాలో పెట్టడం సరదాగా అనిపించవచ్చు. కానీ, ఇది చాలా ప్రమాదకరం. గత కొద్ది సంవత్సరాలలో రైల్వే ట్రాక్ ల మీద, రైలు వచ్చే సమయంలో సెల్ఫీలు తీసుకుంటూ పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలకు అడ్డుకట్ట వేయాలనే ఆలోచనతో రైల్వే అధికారులు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. రైల్వే యాక్ట్ లోని సెక్షన్ 147, 153 ప్రకారం, రన్నింగ్ ట్రైన్స్ దగ్గర, రైల్వే ట్రాక్ ల మీద సెల్ఫీలు తీసుకుంటూ పట్టుబడిన వారికి భారీ జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కొన్నిసార్లు జైలు శిక్ష కూడా విధించబడుతుందని హెచ్చరించారు. ఫోటోల కోసం ప్రాణాలు పణంగా పెట్టడం సరికాదని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు.
రైల్వే అధికారుల మార్గదర్శకాలు
⦿ ట్రాక్ ల మీద సెల్ఫీలు తీసుకోకూడదు: రైల్వే ట్రాక్ ల మీద లేదంటే సమీపంలో ఎప్పుడూ సెల్ఫీలు తీసుకోకూడదు. ఫోటోల కంటే ప్రాణాలు చాలా ముఖ్యమైనవి.
⦿ చట్టపరమైన చర్యలు: రైల్వేలోని ప్రమాదకరమైన ప్రదేశాలలో సెల్ఫీలు తీసుకున్న వారికి జరిమానాలు విధించడంతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచనలు
⦿ సోషల్ మీడియా పోస్ట్ కంటే మీ జీవితం చాలా విలువైనది. మీ ప్రాణాలను పణంగా పెట్టి ఫోటోలు దిగేందుకు ప్రయత్నించకండి.
⦿ స్కూల్, కాలేజీ విద్యార్థులు రైల్వే ప్రమాదాల గురించి అవగాణ పెంచుకోవాలి. రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్ ల వంటి రద్దీగా ఉండే ప్రదేశాలలో సెల్ఫీలు తీసుకోవడం వల్ల ఇతరులతో పాటు మీకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది.
⦿ రైల్వే ప్రమాదాలకు సంబంధించి తల్లిదండ్రులు తమ పిల్లలకు వివరించి చెప్పాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు భద్రతా మార్గదర్శకాలను పాటించేలా చూడాలి.
⦿ ఈస్ట్ కోస్ట్ రైల్వే రైల్వే ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలను చేస్తున్నది. పత్రికల ద్వారా ప్రకటనలు, టీవీ ప్రకటనలు, పబ్లిక్ ప్రకటనలు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నది. మీ ప్రాణాలను కాపాడుకునేందుకు రైల్వే స్టేషన్లు, ట్రాక్ ల మీద సెల్ఫీలు తీసుకోవడం మానుకోండి. ముఖ్యంగా టీనేజర్లు తమ భవిష్యత్ గురించి ఆలోచించండి.. అంటూ ఈస్ట్ కోస్ట్ రైల్వే తన పరిధిలో ప్రచారాలు నిర్వహిస్తున్నది. కఠిన నిబంధనల గురించి అవగాహన కల్పిస్తున్నది. కొద్ది రోజుల పాటు ప్రచారం కల్పించి, ఆ తర్వాత చర్యలకు దిగనున్నట్లు వెల్లడించింది. అటు రైల్వే అధికారులు చేపట్టిన ఈ ప్రచారంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
Read Also: మీరు కళాకారులా? రైల్వే ప్రయాణంలో 75 శాతం రాయితీ పొందచ్చు, ఎలాగో తెలుసా?