Maha Kumbh Mela: మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్-22లో కాసేపటి క్రితం అకస్మాత్తుగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడున్న టెంట్లు అంటుకోవడం మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో వెంటనే భక్తులంతా అక్కడ నుంచి భయంతో పరుగులు తీశారు. అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది..? అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కుంభమేళా వరుస అగ్ని ప్రమాదాలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
కాగా.. రెండు రోజుల క్రితం కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సంఘటన స్థలంలో 20 మంది భక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో పది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగానికి లోనయ్యారు. కుంభమేళాలో వరుస ఘటనలు హృదయ విదారకంగా ఉన్నాయని చెప్పారు. ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతే కాదు.. జ్యుడీషియల్ కమిషన్ కూడా సీఎం ఆదిత్యనాథ్ ఏర్పాటు చేశారు. అధికారులో నిరంతరం సీఎం టచ్‌లో ఉంటున్నారు. తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన భక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25లక్షల చొప్పున పరిహారం కూడా అందజేస్తున్నట్లు ప్రకటించారు. కుంభమేళా అథారిటీ, పోలీస్, పరిపాలన యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ దళాలు.. అన్ని యాక్టివ్ మోడ్‌లో ఉన్నాయని సీఎం చెప్పారు.
అయితే.. రోజురోజుకీ భక్తులు కుంభమేళాకు పోటెత్తుతున్నారు. రోజు లక్షల్లో భక్తులు అక్కడకు చేరుకుని పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో హరహర మహాదేవ్ అనే నినాదంతో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.
ఇవాళ జరిగిన అగ్నిప్రమాదం కుంభమేళాలో మూడవది. తొలిసారి జనవరి 19న మహా కుంభమేళాలో తొలి అగ్నిప్రమాదం సంభవించింది. ఆ అగ్ని ప్రమాదంలో దాదాపు 180 వరకు టెంట్లు తగలబడ్డాయి. మహాకుంభమేళా ప్రాంతంలో శాస్త్రి బ్రిడ్జి సమీపంలోని సెక్టార్-19లో గీతా ప్రెస్ క్యాంప్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. వంటగదిలో టీ చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం సంభవించింది. అనంతరం సిలిండర్లు పేలడంతో టెంట్లు భారీగా అంటుకున్నాయి. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Delhi Elections: ఢిల్లీ ప్రజలపై అడ్డగోలు ఉచితాలు.. కానీ ఈ డేంజర్ ఇష్యూ పట్టించుకోరేంటి..?
కుంభమేళా రెండో అగ్ని ప్రమాదం జనవరి 25న జరిగింది. కుంభమేళాకు సమీపంలో రెండు వాహనాల్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పేయడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళాలో వరుస అగ్ని ప్రమాదాలు భక్తులను ఆందోళన కలగజేస్తున్నాయి. అయితే దేశం నలుమూలులు, ఇతర దేశాల నుంచి కూడా ప్రయాగ్ రాజ్‌కు భక్తుల తాకిడి మాత్రం తగ్గడం లేదు.