రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించే దిశగా కీలక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఎక్కువ ట్రాఫిక్ ఉన్న 76 స్టేషన్లలో చైనా తరహా క్రౌడ్ కంట్రల్ వ్యవస్థను పరిచయం చేయబోతోంది. ఇందుకోసం శాశ్వతమైన హోల్డింగ్ ప్రాంతాలను నిర్మించాలని నిర్ణయించింది. వాస్తవానికి ఇదో మౌలిక సదుపాయాల ప్రణాళికగా కనిపిస్తున్నప్పటికీ, చైనా రైల్వే వ్యవస్థలా రద్దీని అరికట్టేందుకు ఉపయోగపడనుంది. వీటి ఏర్పాటు ద్వారా ప్రయాణీకుల ప్రవాహాన్ని సమర్థవంతంగా నియంత్రించడంతో పాటు రైలు ప్రయాణం సులభతరం, సురక్షితం కానుంది.
దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రయాణీకుల రద్దీ ఉండే 76 స్టేషన్లలో శాశ్వతమైన హోల్డింగ్ లేదంటే వెయిటింగ్ హాల్స్ ను ఏర్పాటు చేయాలని రైల్వే భావిస్తోంది. పండుగలు, హాలీడే ప్రయాణాలు, ఇతర రద్దీ సమయాల్లో సమర్థవంతంగా క్రౌడ్ కంట్రోల్ చేయడమే లక్ష్యంగా వీటిని నిర్మించబోతోంది. ఇప్పటికే ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఈ తరహా హోల్డింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ సక్సెస్ ఫుల్ గా క్రౌడ్ కంట్రోల్ చేస్తున్నారు. ఈ విధానం సక్సెస్ కావడంతో దేశ వ్యాప్తంగా అమలు చేయాలని భారతీయ రైల్వే భావిస్తోంది.
ఆయా రైల్వే స్టేషన్లలో రద్దీని కంట్రోల్ చేసేందుకు ప్రతి జోన్ కు రైల్వే బోర్డు 11 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను పంపింది. వీటిలో ప్లాట్ ఫారమ్ ల బయటే వేచి ఉండే ప్రాంతాలను నిర్మించడం, ప్లాట్ ఫారమ్‌లకు నేరుగా యాక్సెస్ ఇవ్వకపోవడం, CCTV కెమెరాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, బారికేడ్లను ఏర్పాటు చేయడం, మానిటరింగ్ వార్ రూమ్‌లు, టికెట్ వెండింగ్ మెషీన్లు, లగేజ్ స్కానర్లు, అనౌన్స్‌మెంట్ సిస్టమ్ లను ఏర్పాటు చేయడం సహా పలు అంశాలను అమలు చేయాలని సూచించింది. కన్ఫార్మ్ టికెట్ ఉన్న ప్రయాణికులు నేరుగా ప్లాట్ ఫారమ్‌లకు వెళ్లే అవకాశం ఉండగా, టికెట్ లేనివాళ్లు, వెయిటింగ్ లిస్ట్ ఉన్నవారు బోర్డింగ్ వరకు హోల్డింగ్ ప్రాంతంలో వెయిట్ చేయాల్సి ఉంటుందని తెలిపింది.
చైనాలో పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు రైల్వే ప్రయాణం చేసినప్పటికీ, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. చైనా చాలా సమగ్రమైన, సమర్థవంతమైన రైల్వే వ్యవస్థను కలిగి ఉంది. చైనా స్టేషన్లు ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు వచ్చినా, ఈజీగా కంట్రోల్ చేస్తారు. చైనాలోని కికిహార్ సౌత్ రైల్వే స్టేషన్‌లో దాదాపు 30,000 చదరపు మీటర్ల వెయిటింగ్ హాల్ ఉంది. ఇది ఒకే సమయంలో దాదాపు 6,000 మందికి వసతి కల్పించేలా రూపొందించబడింది. అటు చాంగ్ కింగ్ వెస్ట్ స్టేషన్ సుమారు 120,000 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. ఇక్కడ టిక్కెట్లు కొనడం, వేచి ఉండటం, బోర్డింగ్ కోసం మల్టీ లెవల్ నిర్మాణం ఉంటుంది. రైల్వే స్టేషన్లలో ఎంట్రీ మార్గాలు, భారీ కాన్ కోర్స్ లు, ఎలక్ట్రానిక్ టికెటింగ్, రైళ్ల రాకపోకల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. ఆయా రైళ్లు వచ్చే సమయంలో అందులో వెళ్లే ప్రయాణీకులు మాత్రే ప్లాట్ ఫారమ్ మీదికి వెళ్తారు. మిగతా వాళ్లు వెయిట్ రూమ్ లోనే ఉంటాయి. ఈ నేపథ్యంలో రైల్వే ప్లాట్ ఫారమ్ లలో రద్దీ అనేది పెద్దగా కనిపించదు. రైల్వే ఆపరేషన్స్ సజావుగా కొనసాగుతాయి. ఇదే విధానాన్ని ఇండియాలోనూ అమలు చేయాలని భారతీయ రైల్వే భావిస్తోంది.
Read Also: తొలిసారి ఆ మార్గంలో ఖాళీ రైళ్లను నడుపుకునేందుకు అనుమతి, రైల్వే కీలక నిర్ణయం!