Indian Railway Super App: కొద్ది నెలల క్రితం బీటా వెర్షన్ గా విడుదలైన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ‘స్వరైల్’ యాప్ ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) అభివృద్ధి చేసిన ఈ ఆల్ ఇన్ వన్ రైల్వే యాప్.. ఇప్పటికే సూపర్ యాప్ గా గుర్తింపు తెచ్చుకుంది. IRCTC అందించే దాదాపు అన్ని సేవలను ఇకపై ఈ యాప్ లోనే పొందే అవకాశం ఉంది. ఈ యాప్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ తో ఆటు ఆపిల్ యాప్ స్టోర్ లోనూ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ తోపాటు ఐవోఎస్ వెర్షన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని భారతీయ రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం బీటా వెర్షన్ లో ఉన్నప్పటికీ, వినియోగదారులు వారి ప్రస్తుత IRCTC రైల్ కనెక్ట్ అకౌంట్స్ ను ఉపయోగించి లాగిన్ అవ్వవచ్చు. లేదంటే కొత్త అకౌంట్ ను క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది.
సూపర్ యాప్ తో బోలెడు లాభాలు
‘స్వరైల్’ యాప్ తో ఇప్పుడు రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్, ప్లాట్ ఫామ్ టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంది. రద్దీలో టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ లైన్ లో నిలబడకుండా ఈజీగా ఈ యాప్ ద్వారా టికెట్లను పొందే అవకాశం ఉంది. గతంతో పోల్చితే ఈ యాప్ ఇంటర్ ఫేజ్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సింపుల్ గా టికెట్లను బుక్ చేసుకోవడం నుంచి మొదలు కొని టికెట్లు క్యాన్సిల్ చేసుకోవడం, రీఫండ్ క్లెయిమ్ చేసుకోవడం సహా అనేక సేవలను పొందవచ్చు. ‘ స్వరైల్’ లేటెస్ట్ ఇంటర్ ఫేస్ కారణంగా వినియోగదారులు కోరుకున్న సేవలను సులభంగా పొందే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ యాప్ ల మాదిరిగానే, ఫేస్ IDని ఉపయోగించి ఐఫోన్ లో ‘స్వరైల్’కి లాగిన్ అయ్యే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా స్కాన్ చేసి కూడా లాగిన్ కావచ్చు.
‘స్వరైల్’ యాప్ తో పొందే సేవలు
‘స్వరైల్’ యాప్ హోమ్ స్క్రీన్ లో రైళ్ల వివరాలను తెలుసుకోవడం, PNR స్టేటస్ ను తనిఖీ చేయడం, కోచ్ స్థానాన్ని తెలుసుకోవడం, రియల్ టైమ్ ట్రైన్ ట్రాకింగ్, ఫుడ్ ఆర్డర్ చేయడం, రైల్వే అధికారుల సాయం కోరడం, ఫీడ్ బ్యాక్ ఇవ్వడం, టికెట్ బుక్ చేసుకోవడం, టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం, రీఫండ్ క్లెయిమ్ చేసుకోవడం సహా పలు సర్వీసులను పొందవచ్చు. గతంలో ఒక్కో రైల్వే సేవకు ఒక్కో యాప్ ఉండేది. పలు రకాల యాప్స్ ఓపెన్ చేయాలంటే ఇబ్బందిగా ఫీలయ్యేవారు. కానీ, ఇప్పుడు అన్ని సేవలు ఒకే గొడుగు కిందికి రావడంతో ప్రయాణీకులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పటి వరకు బీటా వెర్షన్ లో ఉన్న స్వరైల్ యాప్, ఇకపై పూర్తి స్థాయిలో సేవలను అందించనుంది. ఈ సేవలను వినియోగించుకోవాలని ప్రయాణీకులకు రైల్వే అధికారులు సూచించారు.
Read Also: దేశంలో అత్యంత పొడవైన 5 వందేభారత్ మార్గాలు ఇవే, ఒక్కోటి ఎన్ని కిలో మీటర్లు అంటే!