Maha Kumbh Mela 2025: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జనవరి 14 నుంచి మహాకుంభమేళా నిర్వహించనున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఈ వేడుక కోసం యోగీ సర్కారు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ఆధ్యాత్మిక సంబురానికి భారీగా నిధులు కేటాయించింది. గత కొద్ది నెలలుగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూపీ ప్రభుత్వం పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తున్నది.
మహా కుంభమేళా కోసం రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు
అటు మహా కుంభమేళా కోసం భారతీయ రైల్వే సంస్థ పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. 13 వేల రైళ్లను ఈ వేడుకల కోసం కేటాయించినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ప్రయాగ్ రాజ్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు సుమారు 15 భాషల్లో అన్సౌన్స్ మెంట్ ఇచ్చేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయాణీకులకు పూర్తిస్థాయి సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. టికెట్ల కొనుగోలుకు సంబంధించి ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రయాగ్ రాజ్ లో రైల్వే సంస్థ చేస్తున్న ఏర్పాట్లను తాజాగా కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
Read Also: ఈ రైల్లో టికెట్ లేకుండానే జర్నీ చెయ్యొచ్చు, మీరూ ఓసారి ట్రై చేయండి!
ఉచిత ప్రయాణం అవాస్తవం: రైల్వేశాఖ
అటు ప్రయాగ్ రాజ్ లో జరిగే మహా కుంభమేళాకు ఉచితంగా రైల్వే ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రైల్వేశాఖ స్పందించింది. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. అవన్నీ తప్పుడు వార్తలుగా కొట్టిపారేసింది. టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని వెల్లడించింది. మహా కుంభమేళా రద్దీ దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. “మహా కుంభమేళా సమయంలో ప్రయాణీకులను ఉచితంగా రైల్లో ప్రయాణించడానికి అనుమతిస్తామని కొన్ని మీడియా సంస్థలు వార్తా కథనాలను ప్రసారం చేయడం భారతీయ రైల్వే దృష్టికి వచ్చింది. టికెట్ లేకుండా ప్రయాణించడం భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం నేరం. శిక్షార్హం కూడా. మహా కుంభమేళా లేదంటే మరే ఇతర సందర్భంలోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించేలా నిబంధనలు లేవు. మహా కుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తుల తరలివచ్చే అవకాశం ఉంది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక హోల్డింగ్ ఏరియాలు, అదనపు టిక్కెట్ కౌంటర్లు, ప్రయాణీకుల రద్దీని మేనేజ్ చేయడానికి అవసరమైన ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశాం” అని రైల్వేశాఖ వెల్లడించింది.
ఇక మహా కుంభమేళాకు నడిపే రైళ్ల విషయంలోనూ రైల్వేశాఖ కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ రైళ్లకు రెండు ఇంజిన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. సమయాన్ని ఆదా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
Read Also: మహా కుంభమేళా స్పెషల్ ప్యాకేజీ.. తక్కువ ఖర్చుతో అయోధ్య, వారణాసి చూసే అవకాశం!