IRCTC Maha Kumbh Punyakshetra Yatra: ఉత్తర ప్రదేశ్ లో నిర్వహించే మహా కుంభమేళాకు సమయం దగ్గర పడుతోంది. వచ్చే నెల నుంచి జరగనున్న ఈ వేడుకల కోసం యోగీ సర్కారు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నది. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే చోట భక్తులు స్నానం ఆచరించేందుకు తరలి వస్తారు. త్వరలో మహా కుంభమేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రా నుంచి వచ్చే భక్తుల కోసం IRCTC ‘మహా కుంభ పుణ్యక్షేత్ర యాత్ర’ పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. భారత్ గౌరవ్ టూరిస్టు రైలు ద్వారా తెలుగు రాష్ట్రాల భక్తలను కుంభమేళాతో పాటు వారణాసి, అయోధ్య దర్శనం కలిగించేలా ఈ ప్యాకేజీని పరిచయం చేశారు. ఈ ప్యాకేజీకి సంబంధించి ధర ఎంత? ఏ ప్రదేశాలు చూపిస్తారు? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
జనవరి 19న ప్రారంభం కానున్న యాత్ర
‘మహా కుంభ పుణ్యక్షేత్ర యాత్ర’ మొత్తం సుమారు వారం రోజుల పాటు కొనసాగుతుంది. 8 పగళ్లు, 7 రాత్రులు ఉంటాయి. ఈ యాత్ర సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం అవుతుంది. భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో టూరిస్టులు ఈ రైలు ఎక్కే అవకాశం ఉంటుంది. టూర్ పూర్తి అయిన తర్వాత ఇవే రైల్ఏ స్టేషన్లలో దిగే అవకాశం ఉంది. ఈ యాత్ర జనవరి 19, 2025 నుంచి ప్రారంభం కానుంది.
⦿తొలి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా మహా కుంభమేళాకు యాత్ర మొదలవుతుంది. భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్ల నుంచి యాత్రికులు ఎక్కవచ్చు.
⦿రెండో రోజు తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్ల మీదుగా రైలు ప్రయాణం కొనసాగుతుంది.
⦿మూడో రోజు మూడో రోజు ఉదయం 8 గంటలకు యాత్రికుల రైలు వారణాసికి చేరుకుంటుంది. అక్కడి నుంచి అందరూ హోటల్ కు వెళ్తారు. సాయంత్రం సమయంలో గంగా హారతి వేడుకలో పాల్గొంటారు. ఆ రాత్రి అక్కడే బస చేస్తారు.
⦿నాలుగో రోజు ఉదయం అల్పాహారం చేసిన తర్వాత ప్రయాగ్ రాజ్ బయల్దేరుతారు. అక్కడ దిగిన తర్వాత హోటల్ కు వెళ్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత కుంభమేళాకు వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
⦿ఐదో రోజు అల్పాహారం తర్వాత వారణాసికి వెళ్తారు. అక్కడ హోటల్ కు వెళ్లిన తర్వాత, కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణదేవి ఆలయ దర్శనం ఉంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు.
⦿ఆరో రోజు ఉదయం అయోధ్యకు బయల్దేరుతారు. అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి, హనుమాన్ ఆలయాలను సందర్శించుకుంటారు. అదే రోజు రాత్రి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.
⦿ఏడో రోజు అంతా ప్రయాణం కొనసాగుతుంది. ఎనిమిదో రోజు తెలుగు రాష్ట్రాల్లోకి రైలు ఎంట్రీ ఇస్తుంది. పలు రైల్వే స్టేషన్లలో ఆగుతూ చివరకి సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ పూర్తి అవుతుంది.
‘మహా కుంభ పుణ్యక్షేత్ర యాత్ర’ టూర్ ప్యాకేజీ ఛార్జీలు
⦿స్లీపర్ క్లాస్‌లో పెద్దలకు రూ. 22,635, పిల్లలకు రూ.21,740గా ఛార్జీ నిర్ణయించారు.
⦿3ఏసీలో పెద్దలకు రూ.31,145, పిల్లలకు రూ.30,095 గా ఛార్జీ ఫిక్స్ చేశారు.
⦿2ఏసీలో పెద్దలకు రూ.38,195, పిల్లలకు రూ.36,935గా ఛార్జీ నిర్ణయించారు.
Read Also: ఇకపై జర్నీ చేయాలంటే టికెట్ తో పాటు అది కూడా ఉండాల్సిందే! ఇండియన్ రైల్వే సరికొత్త రూల్!