Indian Railways Conducts Surprise Inspection: కాశ్మీర్ లో రైల్వే కనెక్టివిటీ పెంచే దిశగా భారతీయ రైల్వే కీలక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే జమ్మూ నుంచి నేరుగా శ్రీనగర్ కు రైల్వే లైన్ ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రతిష్టాత్మక ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్(USBRL) పూర్తి చేసింది. అత్యంత సవాళ్లతో కూడిన ఈ మార్గాన్ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. చీనాబ్ నది మీద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే లైన్ ను నిర్మించింది. అంజిఖ్వాడ్ కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది. గత నెలలోనే ఈ మార్గంలో రైల్వే సర్వీసులు ప్రారంభించాల్సి ఉన్నా, వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఈలోగా పహల్గామ్ ఉగ్రదాడి జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూ-శ్రీనగర్ మధ్య నేరుగా రైల్వే సర్వీసులు ఎప్పుడు ప్రారంభం అవుతాయనే విషయంపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
రైల్వే అధికారుల ఆకస్మిక తనిఖీలు, 23 మందిపై కేసు
తాజాగా ఉత్తర రైల్వే పరిధిలోని జమ్మూ డివిజన్ లో రైల్వే అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బారాముల్లా- సంగల్దాన్ రైల్వే స్టేషన్ వరకు టికెట్ తనిఖీలు నిర్వహించారు. కాశ్మీర్ లోయలో టికెట్ లేని ప్రయాణాన్ని అరికట్టడానికి, రైల్వే ఆదాయాన్ని పెంచడానికి చెకింగ్స్ చేపట్టారు. 64652 నెంబర్ గల బారాముల్లా-సంగల్దాన్ మెము రైలు సర్వీస్ లో టికెట్ చెకింగ్ డ్రైవ్ నిర్వహించారు. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న 23 మందిపై కేసు నమోదు చేశారు. సుమారు రూ. 6,520 జరిమానా విధించారు.
టికెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు
టికెట్ లేకుండా ప్రయాణం చేయడం ఆర్థిక నేరం కిందికి వస్తుందని జమ్మూ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఉచిత్ సింఘాల్ వెల్లడించారు. దేశ సార్వభౌమత్వానికి, రైల్వే ప్రయాణీకుల భద్రతకు కూడా ముప్పు కలుగుతుందన్నారు. “ఆదిల్ హుస్సేన్ (డివై సిఐటి శ్రీనగర్), తారిఖ్ అహ్మద్ (సిఎంఐ/శ్రీనగర్), ఫిరోజ్ అహ్మద్ ఖాన్ (టిఐ/బుద్గాం), నుస్రత్ ఖయూమ్ (టిటిఐ, బుద్గాం) నేతృత్వంలోని చీఫ్ ఏరియా మేనేజర్ శ్రీనగర్‌లో ఆకస్మిక టికెట్ తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృదం చేసిన ఆకస్మిక తనఖీలను ప్రశంసిస్తున్నాను. టికెట్ లేని ప్రయాణీకులను తనిఖీ చేయడానికి డివిజన్ అంతటా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. టికెట్ లేని ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తాం” అని ఆదిల్ తెలిపారు.
ప్రయాణీకులు టికెట్ తీసుకుని ప్రయాణం చేయాలని రైల్వే అధికారులు సూచించారు. టికెట్ లేకుండా ఎవరు ప్రయాణం చేసిన తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. రైల్వే చట్టాల ప్రకారం కేసులు నమోదు అయితే, యువత భవిష్యత్ ఆగమయ్యే అవకాశం ఉందన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేయాలంటే టికెట్ ను కొనుగోలు చేయాలన్నారు.
Read Also: ‘స్వరైల్’ యాప్ వాడుతున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలియాల్సిందే!